ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో పైరవీలకు తావు ఉండదని, తన, పర బేధాలు లేవని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారు. తాజాగా ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ పథకానికి తెలుగుదేశం పార్టీ నాయకుడి కుమార్తెను కూడా ఎంపిక చేశారు. విజయనగరం జిల్లా వంగర మండలం సంగాం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచి బొడ్రోతు శ్రీనివాసరావు-వేణమ్మల కుమార్తె శైలజ ఈ పథకానికి ఎంపికయ్యారు. శుక్రవారం తొలి విడతగా ఆమె ఖాతాలో రూ.13,99,154 ప్రభుత్వం జమ చేసింది. రెండేళ్లలో శైలజ చదువుకు ప్రభుత్వం సుమారు రూ. 84 లక్షలు అర్థికసాయం అందిస్తుందని విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తెలిపారు.
థ్యాంక్స్ టూ సీఎం
జగనన్న విద్యాదీవెన పథకం కింద ఆర్థిక సాయం అదడంతో విద్యార్థిని శైలజ ఆనందం వ్యక్తం చేసింది. ఈ పథకం గురించి వార్తల్లో చూసి అప్లై చేశానని చెప్పింది. ప్రపంచంలోనే వంద యూనివర్సిటీల్లో ఒకటైన వాషింగ్టన్‌లో సీటు పొందానని తెలిపింది. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆమె థ్యాంక్స్ చెప్పింది. అలాగే జగనన్న విదేశీ విద్యాదీవెన పథకంలో ఎంపిక చేసినందుకు మఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని శైలజ తండ్రి శ్రీనివాసరావు భావోద్వేగానికి లోనయ్యారు. జనం కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. తన కూతురు హైదరాబాద్‌లో ఐఐటీ చదివిందని, ఇప్పుడు జగనన్న విద్యాదీవెనతో మంచి యూనివర్సీటీలో సీటు సంపాదించిందన్నారు. భవిష్యత్తులో తన కూతురు ఏపీ అభివృద్ధికి పాటుపడుతుందన్నారు.
జగనన్న విద్యాదీవెన ప్రయోజనాలు
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేద వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్య కోర్సులు చదివేందుకు ఆర్థికసాయం చేడమే జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ప్రధాన ఉద్దేశం. ఈ పథకం ద్వారా.. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో టాప్-200 జాబితాలో నిలిచిన యూనివర్సిటీల్లో.. ఎంబీబీఎస్, పీజీ, పీహెచ్‌డీ స్థాయి కోర్సుల్లో ప్రవేశం ఖరారు చేసుకున్న వారికి ప్రభుత్వ ఆర్థిక సాయం అందిస్తుంది. క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్-100 జాబితాలో ఉన్న యూనివర్సిటీల్లో ప్రవేశం పొందితే మొత్తం ట్యూషన్ ఫీజు(100శాతం)ను చెల్లిస్తారు. దీని కింద SC, ST, BC మరియు మైనారిటీ విద్యార్థులకు ₹1.25 కోట్ల వరకు, EBC విద్యార్థులకు ₹1 కోటి వరకు రీయింబర్స్‌మెంట్ పొందవచ్చు. అలాగే క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం 101-200 జాబితాలోని యూనివర్సిటీల్లో ప్రవేశం పొందితే.. ట్యూషన్ ఫీజు మొత్తంలో యాభై శాతం లేదా రూ.50 లక్షలు(ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని)సాయంగా అందజేస్తారు. ఆర్థిక సహాయం.. విమాన ఛార్జీలు మరియు వీసా ఫీజు వంటి అంశాలకు రీయింబర్స్‌మెంట్ రూపంలో వస్తుంది. విద్యార్థులు వారి ఇమ్మిగ్రేషన్ కార్డుల (I-94) రసీదుని అనుసరించి, మొదటి చెల్లింపు చేయబడుతుంది. మొదటి సెమిస్టర్ ఫలితాలను అనుసరించి రెండో, సెకండ్, థర్డ్ సెమిస్టర్‌లు పూర్తయిన తర్వాత మూడో ఇన్‌స్టాల్‌మెంట్ జమ అవుతుంది. అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం ₹8 లక్షలకు మించకుండా ఉంటేనే దీనికి అర్హులు.
Also Read: Balakrishna: నర్సులపై చేసిన వ్యాఖ్యల దుమారం.. వక్రీకరంచారంటూ బాలయ్య వివరణ