Is TDP-Janasena Waiting for BJP’s Call: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని టీడీపీ-జనసేన పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇందుకోసం ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా.. దానిని సువర్ణావకాశంగా మలుచుకుని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుకు వెళుతున్నారు. గెలుపే లక్ష్యంగా దూసుకెళుతున్న టీడీపీ-జనసేన పార్టీలు తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి. రెండో జాబితా ఇంకా విడుదల చేయాల్సి ఉంది. అయితే సెకండ్ లిస్ట్ ఇంకా రిలీజ్ చేయకపోవడానికి కారణం బీజేపీనే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేలేదు. బీజేపీ పిలుపు కోసం టీడీపీ-జనసేన పార్టీలు ఎదురుచూస్తున్నాయి.
సెకండ్ లిస్టు విడుదలపై అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ కసరత్తులు చేస్తున్నారు. బీజేపీ విషయంలో క్లారిటీ వస్తే.. మరో వారం రోజుల్లో రెండో జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. బీజేపీ పిలుపు కోసం రెండు పార్టీల ఎదురుచూస్తున్నాయి. బీజేపీ విషయంలో క్లారిటీ వస్తే.. ఎంపీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన పార్టీలకు బీజేపీ వ్యవహరం తలనొప్పిగా మారింది. ఇంతకు కూటమితో పొత్తు బీజేపీ ఇష్టం ఉందా? లేదా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే లేట్ చేస్తోందా? అని పార్టీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది.
మొత్తం 118 సీట్లతో టీడీపీ-జనసేన తొలి జాబితా ఇటీవల రిలీజైంది. తొలి జాబితాలో 94 మంది టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించారు. 5 సీట్లలో అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మొత్తం 175 స్థానాల్లో 24 సీట్లు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. అలాగే జనసేన 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. బీజేపీ కూడా కలిసొస్తే.. తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఇక రెండో విడతలో టీడీపీ 25-30 స్థానాలు, జనసేన 10-12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రెండో విడతలోనూ బీసీ, వైశ్య, మైనార్టీ ఈక్వేషన్లపై చంద్రబాబు, పవన్ కసరత్తు చేస్తున్నారు.