Anaparthy MLA Sathi Suryanarayana Reddy Comments: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. మరోసారి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఒకరికొకరు సవాళ్లు విసురుకోవడంతో అక్కడి రాజకీయం వేడిక్కింది. ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి చేసిన 500 కోట్ల అవినీతిని నిరూపిస్తానంటూ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సవాల్‌ను ఎమ్మెల్యే స్వీకరించారు. తనపై అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా అని అనపర్తి ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ… ‘నా అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా. సవాల్ చేసిన మేరకు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చర్చకు రావాలి. నాపై అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా. లేని పక్షంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రాజకీయాల నుంచి నిష్క్రమించాలి. నాపై చేసిన అవినీతి ఆరోపణల మేరకు 500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి డిపాజిట్ చేయాలి. టీడీపీ సర్వేలో వచ్చిన ఓటమి భయంతో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇటువంటి జిమ్మిక్కులు చేస్తున్నారు’ అని అన్నారు.
Also Read: Fake Currency in Medaram: మేడారం హుండీ లెక్కింపు.. బయటపడ్డ నకిలీ కరెన్సీనోట్లు
అనపర్తి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య బహిరంగ చర్చ నేపథ్యంలో రామవరంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మొహరింపుచారు. రామకృష్ణారెడ్డి ఇంటికి టీడీపీ శ్రేణులు భారీగా చేరుతున్నాయి. పోలీసులు 144 సెక్షన్ అమలు చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. రామకృష్ణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. గతంలో బిక్కవోలు వినాయకుడు సాక్షిగా సత్య ప్రమాణాలకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సిద్ధమయ్యారు. గత సంవత్సర కాలంగా అనపర్తి అవినీతి ఆరోపణలపై ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే.