Off The Record : కంచు కోటకు కన్నాలు పడుతుంటే… టీడీపీ అధిష్టానం చోద్యం చూస్తోందా? మాకో నాయకుడు కావాలి మొర్రో… అని కేడర్ మొత్తుకుంటున్నా, బాధ్యతలు తీసుకునేందుకు నేతలు సిద్ధంగా ఉన్నా… పార్టీ పెద్దలు మాత్రం ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారు? అధికారంలో ఉండి కూడా.. మిత్రపక్షం ఎమ్మెల్యే ఉన్న చోట ఒక ఇన్ఛార్జ్‌ని పెట్టుకోలేని దైన్యం ఏంటి? ఎక్కడ తేడా కొడుతోంది.. శ్రీకాకుళం జిల్లా ముఖ ద్వారం, వెనుకబాటు ఉన్న చోట అభివృద్ధి జాడలు కనిపించే ప్రాంతం, హేమా హేమీలు ప్రాతినిధ్యం వహించిన నియెజకవర్గం ఎచ్చెర్ల. ఇప్పటికీ తెలుగుదేశానికి కంచుకోట ఈ సెగ్మెంట్. అలాంటి చోట పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందంట. 2024 ఎన్నికల టైంలో కూటమి పొత్తులో భాగంగా బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది ఈ సీటు. ఆ పార్టీ తరపున నడికుదిటి ఈశ్వరరావు పోటీ చేసి కూటమి వేవ్‌లో గెలిచేశారు. కానీ… గతంలో ప్రతిభా భారతి, కళావెంకట్రావ్ లాంటి సీనియర్స్ ప్రాతినిధ్యం వహించిన చోట నేడు నాయకత్వం లేకపోవడం ఏంటని మథనపడుతోంది టీడీపీ కేడర్.
Read Also : Adoni : ఆదోనీలో ఎమ్మెల్యే అనుచరుల హల్ చల్..
ఇదే అంశాన్ని అధిష్దానం దృష్టికి తీసుకెళ్ళినా పెద్దగా ప్రయెజనం లేకుండా పోయిందట.ఎలక్షన్స్‌కు ముందు వరకూ ఇక్కడ కిమిడి కళావెంకట్రావ్ , కలిశెట్టి అప్పల నాయుడు వర్గాలు ఉన్నా… పార్టీ మాత్రం బలంగానే ఉండేది. తర్వాత ఒకరు విజయనగరం జిల్లా ఎంపీగా, మరొకరు చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలిచి బిజీ అయ్యారు. దీంతో ఎచ్చెర్ల టిడిపి క్రింది స్థాయి నేతలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్ధంకాని పరిస్థితి. అందుకే మిత్రపక్షం ఎమ్మెల్యే ఉంటే ఉన్నారు. మాకో నాయకుడు కావాలని మొత్తుకుంటున్నా పార్టీ పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదన్న చర్చ జరుగుతోంది కేడర్‌లో. కూటమిలో విభేదాలు వద్దు….. కింది స్థాయిలో కలిసి పనిచేయండని టీడీపీ, జనసేన అగ్ర నేతలు తరచూ చెబుతుంటారు.
అందులో భాగంగానే బీజేపీ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావుకు ఇబ్బంది కలగకుండా ఎచ్చెర్లలో తాము సంస్థాగతంగా బలంగా ఉన్నాసరే టీడీపీ ఇన్ఛార్జ్‌ని పెట్టడం లేదా అన్న డౌట్స్ వస్తున్నాయి. అదే సమయంలో నియోజకవర్గంలో మరో పవర్ సెంటర్ తయారవకుండా… ఎమ్మెల్యే కూడా… టీడీపీ పెద్దల దగ్గర తనకున్న పలుకుబడితో పావులు కదుపుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ పాయింట్ మీదే కార్యకర్తలకు మండిపోతోందట. మిత్రపక్షాల మధ్య విభేదాలు రావద్దనుకోవడం బాగానే ఉందిగానీ… అందుకోసం మన పార్టీని పణంగా పెడతారా అని మండిపడుతున్నారట. ఇక ఇదే సమయంలో ఇక్కడ జనసేన కూడా దూకుడు ప్రదర్శిస్తుండటం టీడీపీ ద్వితీయ శ్రేణిలో కలవరాన్ని పెంచుతోందట.
ఉత్తరాంధ్ర మీద దృష్టి పెట్టారని చెప్పుకుంటున్న జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఎచ్చెర్ల మీద దృష్టి పెట్టారట. దీంతో… వెనకబడిపోతున్నామని భావిస్తున్న ఎచ్చెర్ల టీడీపీ లీడర్స్ విషయాన్ని నేరుగా….పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళారట. ఇది ఇలాగే కొనసాగితే… మన కంచుకోటను మనమే వేరేవాళ్ళకు పువ్వుల్లో పెట్టి అప్పగించాల్సి వస్తుందని చెప్పినట్టు తెలిసింది. అలాగే…ఎంపీ కలిశెట్టి లేదా కళావెంకట్రావ్ కుమారుడు రాంమల్లిక్ నాయుడులో ఎవరో ఒకరికి బాధ్యతలు ఇవ్వమని కోరినట్టు సమాచారం. వెంటనే ఆ పని చేయకుంటే కేడర్‌లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని చెప్పేశారట. ఈ పరిస్థితుల్లో ఎచ్చెర్ల కూటమి రాజకీయం ఆసక్తికరంగా మారింది. పార్టీ పెద్దలు తక్షణ నిర్ణయం తీసుకుంటారా? లేక సహజ ధోరణిలో నానుస్తారా అని ఆసక్తిగా చూస్తోంది టీడీపీ కేడర్.
Read Also : Varanasi : వారణాసికి డబ్బింగ్ చెప్పడంపై ప్రియాంక చోప్రా క్లారిటీ