Off The Record : ఆ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు విచ్చలవిడిగా చెలరేగుతున్నారా? చివరికి రోడ్డు పక్కన బజ్జీల బండ్ల వాళ్ళని కూడా బతకనీయడం లేదా? ప్రశ్నించిన వాళ్ళకు దాడులే సమాధానమా? అంత జరుగుతున్నా… ఎమ్మెల్యేకి ఏం తెలియడం లేదా? లేక తెలిసి కూడా మనోళ్ళేకదా దండుకోనీయమని వదిలేస్తున్నారా? ఎక్కడుందా అరాచక పరిస్థితి? ఎవరా ఎమ్మెల్యే.. కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కంటే…. ఆయన అనుచరులే ఎక్కువగా వార్తలకెక్కుతున్నారు. ఎమ్మెల్యేకి డైరెక్ట్‌గా సంబంధం ఉందా లేదా అన్న సంగతి పక్కనబెడితే… ఆయన పేరు చెప్పి, అండ చూసుకుని అనుచరులు చేస్తున్న ఆగడాలు, అరాచకాలకు మాత్రం హద్దే లేకుండా పోతోందన్న అభిప్రాయం మాత్రం నియోజకవర్గంలో బాగా బలపడుతోంది. అనుచరుల్లో కూడా ఒకరో ఇద్దరో తప్పు చేశారంటే అది వేరే సంగతి. అలా కాకుండా… అన్నీ ఆణిముత్యాలే అన్నట్టుగా… ఒక్కొకరు ఒక్కో రకంగా చెలరేగిపోతుండటంతో… ఎమ్మెల్యే పరువు కూడా రోడ్డున పడిందని మాట్లాడుకుంటున్నారు స్థానికంగా.
Read Also : Yellareddyguda incident : దారుణం.. లిఫ్టులో ఇరుక్కుని ఏడేళ్ల బాలుడి మృతి
ఎమ్మెల్యేగా… పార్థసారధి చేసిన మంచి పనులకంటే ఆయన అనుచరులు వెలగబెడుతున్న నిర్వాహకాల గురించే ప్రజల్లో ఎక్కువగా చర్చ జరుగుతోందట.ఎమ్మెల్యే స్థానికుడు కాకపోవడంతో… ఒక వర్గమంటూ లేని సందర్భంలో ఆదోని బీజేపీ టికెట్ వచ్చింది. సరిగ్గా అదే టైంలో బీజేపీ క్యాడర్ సహా ఇతర పార్టీల నుంచి కూడా చాలా మంది ఆయన పంచన చేరారు. దాంతో… ఎవరు మంచి వాళ్ళు, ఎవరు అరాచకవాదులన్న సంగతి ఎమ్మెల్యే తెలుసుకోలేకపోతున్నారా అన్న డౌట్స్ సైతం ఉన్నాయి. నేరుగా ఆయన ప్రమేయం లేకున్నా… ఎమ్మెల్యే అండ చూసుకుని అనుచరులు ఇన్నాళ్ళు చేసిన దందాలు ఒక ఎత్తయితే… ఇటీవల ఆదోనిలో బీజేపీ కార్యకర్త మహేష్ నాయక్ ఓ బాలికను వేధించిన వ్యవహారం అరాచకాలకు పరాకాష్ట అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి బీజేపీలో చేరారు మహేష్ నాయక్. అలాగే ఆయన ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితుడన్న పేరుంది. పార్థసారధి నియోజకవర్గంలో ఉంటే… మహేష్ ఎక్కువ సమయం ఆయన దగ్గరే ఉంటాడట. ఇక స్థానిక భరత్‌నగర్‌లో మహేష్ హవా అంతా ఇంతా కాదు. రోడ్డు పక్కన బంకులు పెట్టుకోవలన్నా, కుళాయి కనెక్షన్ కావాలన్నా, అతర ఏ చిన్నా చితకా పనులు జరగాలన్నా… ఇతని అనుమతి ఉండాల్సిందేనట.
అలాగే… ఆ ప్రాంతంలో యువతులతో మహేష్ నాయక్ ప్రవర్తించే తీరు కూడా సరిగా ఉండదని చెప్పుకుంటున్నారు. ఇటీవల ఓ బాలిక మహేష్ వేధింపులు భరించలేక బంధువులతో కలిసి ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తే… ఏకంగా వాళ్ళ మీద దాడికి తెగబడ్డాడట ఈ అరాచకవాది. దాంతో…బాలిక కూడా ఎదురుతిరిగి రాళ్ళు విసరడంతో…వాతావరణం ఉద్రిక్తంగా మారిందట. నా మీదే ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడానికి వస్తారా అంటూ దాడి చేశారన్నది బాలిక బంధువుల ఆరోపణ. ఆ బాలిక బజ్జీల బండి పెట్టుకున్న ప్రాంతంలో బీజేపీ జెండా పాతించాడట మహేష్ నాయక్. ఆ తరువాత కూడా బాలికను నిత్యం అసభ్య పదజాలంతో దూషించేవాడట. దాడి తర్వాత మొత్తం వ్యవహారం రచ్చకెక్కడంతో పోలీసులు ఎమ్మెల్యే అనుచరుడి మీద పోక్సో కేసు పెట్టారు. ఇలా… ఆదోనిలో మహేష్ నాయక్ వ్యవహారమే కాదు….గతంలోనూ అనేక మంది పార్థసారధి అనుచరులు అనేకరకలుగా వార్తల్లోకెక్కారు. ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ఒకరు 2 కోట్లు విలువ చేసే భూమిని ఆధార్ మార్ఫింగ్‌తో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించాడు. దానికి సంబంధించి పోలీస్ కేసు బుక్ అయింది. ఆ తర్వాత ఎమ్మెల్యే అనుచరులు చేసిన మరో అక్రమ రిజిస్ట్రేషన్ కూడా బయటపడింది.
యగ్గటి ఈశప్ప అనే వ్యక్తి బతికి వుండగానే డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను అక్రమంగా తీసుకుని జీపీ చేయించుకున్నారు. సంబంధం లేని వ్యక్తుల పేర్లతో 35 కోట్లు విలువ చేసే 6 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ తంతును పార్థసారధి అనుచరులు వెనుకుండి నడిపించారట. బాధితులు గుర్తించి ఫిర్యాదు చేయడంతో కేసు పెట్టి ఆ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారు. ఇసుక ట్రాక్టర్ల యజమానులు, ఇతర రాష్ట్రాల కు వెళ్లే వాహనాలపై కూడా దౌర్జన్యం చేసి మామూళ్లు డిమాండ్ చేస్తున్నారట ఎమ్మెల్యే అనుచరులు. సిమెంట్ ఫ్యాక్టరీల్లో వినియోగించే ఫ్లై యాష్ కర్ణాటక నుంచి ఆదోని మీదుగా తెలంగాణకు రవాణా అవుతుంది. దీంతో… మా ఊరి మీదుగా మీ వాహనాలు వెళ్తున్నాయి కాబట్టి…మామూళ్లు మాట్లాడుకోవాలంటూ టిప్పర్ యజమానిని ఎమ్మెల్యే అనుచరుడు నాగరాజ్ గౌడ్ బెదిరించడం కలకలం సృష్టించింది. ఇసుక ట్రాక్టర్లను రాత్రి వేళల్లో వెంటాడి అడ్డుకొని డ్రైవర్ పై దాడి చేసిన ఘటనలు జరిగాయి.
ట్రాక్టర్ నెలకు 15 వేలు, టిప్పర్ ఒక ట్రిప్‌కి 1500 రూపాయల చొప్పున ఇవ్వాలని బెదిరించిన వ్యవహారం కూడా అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఇవి బయటకు వచ్చిన సంఘటనలు మాత్రమే. పైకి కనిపించకుండా ఇంకా చాలానే జరుగుతున్నాయన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ఈ స్థాయిలో ఇన్ని జరుగుతున్నా ఎమ్మెల్యేకు తెలియడం లేదా? ఒకవేళ తెలిసినా మనోళ్ళే కదా… దండుకోనీయమని వదిలేస్తున్నారా? అసలు అదీఇదీ కాకుండా….. బరితెగించిన అనుచరుల్ని ఎమ్మెల్యే పార్థసారధి కంట్రోల్ చేయలేకపోతున్నారా అన్న చర్చలు నడుస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే… రేపటి రోజున అనుచరులు బాగానే ఉంటారుగానీ… ఎమ్మెల్యేకి మాత్రం ఎన్నికల్లో అదిరిపోతుందన్న అభిప్రాయం బలపడుతోంది ఆదోనిలో.
Read Also : Samantha : సమంతపై రాజ్ నిడుమోరు ఆసక్తికర కామెంట్స్