దేశ వ్యాప్తంగా టమోటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో టమోటా పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా టమోటా పంటలు ఎక్కువగా పండే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో రైతులు చాలా నష్టపోయారు. ఈ నేపథ్యంలో రైతులు తమ నష్టాన్ని ధరలు పెంచి భర్తీ చేసుకుంటున్నారు. అకాల వర్షాల వల్ల టమోటాల సరఫరా తక్కువ కావడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యమైన వెజిటబుల్ కావడంతో మెట్రో నగరాలలో టమోటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దేశంలోని 50 నగరాలు, 175 చిన్నపట్టణాల్లో టమోటా ధర కిలో రూ.50 కంటే ఎక్కువగా పలుకుతున్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో కిలో టమోటా ధర రూ.93కి చేరింది. మరోవైపు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనూ కిలో టమోటా ధర రూ.70 నుంచి రూ.80 మధ్య పలుకుతోంది. అటు ఏపీలోనూ కిలో టమోటా రూ.50కి పైగానే ధర ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో రూ.60గా, దేశ రాజధాని ఢిల్లీలో రూ.59గా పలుకుతోంది. దీంతో ప్రజలు టమోటాలను కొనుగోలు చేయాలంటే భయపడుతున్నారు. వండుకుంటున్న కూరల్లో టమోటాలను వాడటం తగ్గించేశారు. కాగా భారతదేశంలో ప్రతి ఏడాది 200 లక్షల టన్నుల టమోటాలు ఉత్పత్తి అవుతాయి. ప్రపంచంలో చైనా తర్వాత టమోటాలు అత్యధికంగా పండే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది.