మున్సిపాల్టీల్లో సమ్మెలో ఉన్న సీఐటీయూతో మంత్రి ఆదిమూలపు సురేష్ చర్చలు ముగిశాయి. రెండున్నర గంటల పాటు మంత్రి, యూనియన్ నేతల మధ్య చర్చలు కొనసాగాయి. అయితే.. సీఐటీయూతో మంత్రి సురేష్ చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలుస్తోంది. మరోవైపు.. సమ్మె విరమించాలని మంత్రి సురేష్ వారిని కోరారు. ఈ క్రమంలో.. చర్చల సారాంశాన్ని కార్మికులకు చెప్పి సమ్మె కొనసాగింపా..? విరమణా..? అనే విషయం తెలియచేస్తామని సీఐటీయూ చెప్పింది. కార్మికుల నుంచి క్లారిటీ తీసుకున్నంత వరకు సమ్మె కొనసాగిస్తామని సీఐటీయూ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. సీఐటీయూ 13 డిమాండ్లల్లో మూడు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకారం చెప్పింది. జీతం పెంపు లేదా సర్వీసుల క్రమబద్దీకరణపై ప్రభుత్వం హామీ ఇవ్వలేదు. మరోవైపు.. సమ్మెలో లేని సంఘాలతో మంత్రి ఆదిమూలపు సురేష్ చర్చలు జరుపుతున్నారు.
Minister Botsa: సీఎం జగన్ మాటిస్తే అమలు చేసి తీరుతారు..
మరోవైపు.. సీఐటీయూ నేత ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ.. 11వ పీఆర్సీ ప్రకారం బేసిక్ రూ. 20 వేల జీతం ఉంది.. పీఆర్సీ ప్రకారం బేసిక్ రూ. 20 వేల ఇవ్వాలని కోరామని అన్నారు. బేసిక్ రూ. 20 వేలు ఇవ్వలేకుంటే.. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయమని కోరామని తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో కూడా చేసే పనికి ఇచ్చే జీతానికి తేడా ఉంది.. దాన్ని సరి చేయాలని కోరినట్లు ఆయన చెప్పారు. తమ డిమాండ్లపై 105 మున్సిపాల్టీల్లో సమ్మె చేస్తున్నామని.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేయమని కోరామని ఉమా మహేశ్వరరావు చెప్పారు.
RGV: నోరు జారిన రామ్ గోపాల్ వర్మ.. కేసు పెట్టిన బర్రెలక్క..
దళారీ విధానం వల్ల క్లాప్ డ్రైవర్లకు సరైన జీతాలు లభించడం లేదని సీఐటీయూ నేత ఉమా మహేశ్వరరావు అన్నారు. క్లాప్ డ్రైవర్లకు జీతాల్లో తేడాలు లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.. తమకు మాట మాత్రంగా చెబితే సరిపోదని వెల్లడించామన్నారు. తాము మాత్రమే సమ్మెలో ఉన్నామని.. ఇంకొన్ని సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చినా.. ఇంకా సమ్మెకు వెళ్లలేదని తెలిపారు. మేం సమ్మెను కొనసాగిస్తాం.. మేం పెట్టిన 13 డిమాండ్లల్లో మూండింటికి మాత్రమే ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఉమా మహేశ్వరరావు అన్నారు.