NTV Telugu Site icon

TPCC Mahesh Goud : ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద హరీష్ రావు నిరసన… మహేష్ కుమార్ గౌడ్ ఘాటు విమర్శలు

Tpcc Chief, Mahesh Kumar Goud

Tpcc Chief, Mahesh Kumar Goud

TPCC Mahesh Goud : ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు, మాజీ మంత్రులుగా కనీస మినహాయింపు లేకుండా ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు వెళ్లి నిరసన తెలపడం సిగ్గుచేటని టిడిసిసి చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రతి విషయాన్ని రాజకీయ రంగు పులమడం అలవాటైపోయిందని, శవాలపై రాజకీయం చేయడం వారి నైజమని ఆయన ధ్వజమెత్తారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 24 గంటల పాటు రిస్క్యూ టీమ్స్ అహర్నిశలు శ్రమిస్తున్న వేళ, హరీష్ రావు నేతృత్వంలోని బృందం అక్కడికి వెళ్లి హడావిడి చేయడం, ఫోటోలకు పోజులు ఇవ్వడం వారి పనికి ఆటంకం కలిగించడమేనని ఆయన విమర్శించారు. కనీసం రక్షణ చర్యలకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్ నేతలకు లేకపోవడం దారుణమని అన్నారు.

Trump “Gold Card”: ‘‘గోల్డ్ కార్డ్’’ పౌరసత్వం భారతీయులకు వరమా.? ట్రంప్ ఏమన్నారంటే..

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ దశలో ఏ ఒక్క మీడియా సంస్థకైనా అనుమతి ఇచ్చారా? మీ పాలనలో కిలోమీటర్ల దూరంలో మీడియాను నిలిపిన చరిత్ర మీది కాదా? ఇప్పుడు హరీష్ రావు మీడియా ముందుకు వచ్చి హడావిడి చేయడం, ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఎంతవరకు న్యాయం? అంటూ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. దేశవ్యాప్తంగా అన్ని విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దింపి, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతుంటే, హరీష్ రావు మాత్రం ఎలాంటి దిశా నిర్దేశం లేకుండా అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

రెండేళ్ల క్రితమే భారీ పెట్టుబడులతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు దెబ్బతిన్నది? లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రాజెక్ట్ ఎందుకు అర్ధాంతరంగా నిలిచిపోయింది? వరదలు వచ్చినప్పుడు బాహుబలి మోటార్లు నీట మునగడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పగలరా? అంటూ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. తాము నిర్మించిన ప్రాజెక్ట్ పరాజయం పాలయినప్పటికీ, తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునే బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. హరీష్ రావు ప్రజాసమస్యలపై గళమెత్తడంలో తప్పులేదు, కానీ సహాయక చర్యలకు అడ్డంకిగా మారేలా నిరసనలు చేయడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు. టన్నెల్ వద్ద అర్ధం లేని హడావిడి చేయడం, మీడియా ముందు ఫోటోలకు పోజులివ్వడం కాదు, బాధితులను కాపాడే చర్యలకు సహకరించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.

Sikandar Teaser : ‘సికందర్’ టీజర్ విడుదల.. యాక్షన్‌తో పిచ్చెక్కించిన సల్మాన్..