క్రికెట్లో చిన్న దేశమైన ఇటలీ చరిత్ర సృష్టించింది. వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్కప్ కు అర్హత సాధించింది. ఇటలీ దేశ చరిత్రలో మొట్టమొదటి సారి అంతర్జాతీయ వేదిక మీద టాప్ టీమ్స్ తో కలిసి పొట్టి వరల్డ్ కప్ ఆడనుంది. ఇక ఓవరాల్ గా ఈ టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న 25వ జట్టుగా నిలిచింది.
ప్రస్తుతం హాగ్ వేదికగా జరుగుతున్న యూరప్ క్వాలిఫైయర్స్ లో ఫైనల్ మ్యాచ్ ఇటలీ, నెదర్లాండ్స్ మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ గెలిచినప్పటికీ.. మొదటి రెండు స్థానాల్లో ఈ జట్లు నిలవడంతో, మెగా టోర్నీకి అర్హత సాధించాయి. ఇక ఇటలీ,జెర్సీ టీం ఆడిన 4 మ్యాచుల్లో 2 గెలిచినప్పటికీ.. ఇటలీ నెట్ రన్ రేట్ కాస్త మెరుగ్గా వుండడటంతో జెర్సీ టీంను దాటి 2వ స్థానంలో నిలిచింది. ఇక ఇటలీ జట్టుకు ఆస్ట్రేలియాకు ఆడిన జో బర్న్స్ కెప్టెన్ గా వున్నాడు. ఇతడు ఇటలీకు వలస వెళ్లడంతో అక్కడి జట్టుకు ఆడుతున్నాడు. బర్న్స్ ఆస్ట్రేలియా తరుపున 23 టెస్టులు, 6 ఒన్డేలు ఆడాడు.
ఇదిలా ఉండగా గత నాలుగు వరల్డ్ కప్స్ లో ఆడిన స్కాట్లాండ్ ఈసారి అర్హత సాధించలేకపోయింది. తమ చివరి మ్యాచ్లో జెర్సీ టీంపై ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. కాగా క్రికెట్లో చిన్న దేశమైన ఇటలీ ఫుట్బాల్ లో మాత్రం పెద్ద టీం. ఇప్పటివరకు సాకర్ లో మూడుసార్లు వరల్డ్ కప్ గెలిచింది. ఇక రెండు సార్లు రన్నరప్ గా నిలిచింది.