Duddilla Sridhar Babu : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తాజాగా NTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రంలో డిజిటల్ సేవల విస్తరణపై కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ ఇంటర్నెట్, టెలిఫోన్, కంప్యూటర్ సేవలను తక్కువ ధరలో అందించేందుకు ప్రభుత్వం నూతన ప్రణాళికతో ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు.
“ఇప్పటి వరకు ఉన్న T-Fiber సేవలను మరింత విస్తరించి, నూతన సర్వీసులు జత చేస్తూ T-NXTగా ఆవిష్కరిస్తున్నాం,” అని మంత్రి చెప్పారు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, చివరి గ్రామం, చివరి ఇంటి వరకు ఫైబర్ కనెక్టివిటీ చేర్చే పనిలో ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమం వచ్చే ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే నాలుగు గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతంగా నడుస్తోంది. అక్కడ ప్రజలు ఎంతో హర్షిస్తున్నారు,” అని చెప్పారు.
ప్రతి ఇంటిలో స్మార్ట్ టీవీ ద్వారా టెలిఫోన్, కంప్యూటర్ సదుపాయాలు లభించేలా తయారు చేస్తున్నారని, ఇది విద్య, సమాచారం పరంగా ప్రజలకు చాలా ఉపయోగకరంగా మారనుందని వివరించారు. “ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 43,000 కిలోమీటర్ల ఫైబర్ నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తున్నాం. ఇది దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌గా నిలవనుంది,” అని మంత్రి చెప్పారు.
“పేద, మధ్యతరగతి, పెద్ద తరగతి ప్రజలందరికీ సమానంగా సేవలు అందించాలన్నదే మా ధ్యేయం. ఫింగర్‌టిప్‌లో సమాచారం ఉండేలా సాంకేతిక వనరులు అందిస్తున్నాం. ఇవన్నీ అతి తక్కువ ధరకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం,” అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ‘2013లో UPA ప్రభుత్వం BSNL ద్వారా గ్రామాల్లో ఫైబర్ నెట్‌వర్క్ ఇవ్వాలని ప్రారంభించింది. రాష్ట్ర విభజన తరువాత గత ప్రభుత్వం దీన్ని కొనసాగించింది. ఇప్పుడు మేము దీనిని పూర్తిగా పూర్తి చేయబోతున్నాం. మా ప్రభుత్వానికి సంవత్సరం నాలుగు నెలలు పూర్తవుతున్న ఈ సమయంలో, మిగిలిన 40 శాతం పనులు పూర్తి చేశాం. మిగిలినవన్నీ సమయానుకూలంగా పూర్తి చేస్తాం,” అని ఆయన తెలిపారు.