Supreme Court: యావత్ ప్రపంచాలని కొవిడ్ మహమ్మారి గడగడలాడించిన సంగతి తెలిసిందే. కరోనా నాటి రోజులు గుర్తొస్తేనే గుండెల్లో వణుకుపుడుతుంది. కఠినమైన లాక్‌డౌన్‌లు, భౌతిక దూరాలు, వ్యాక్సిన్‌లతో కరోనా నుంచి ప్రపంచం బయటపడగలిగింది. ఆ సమయంలో జైళ్లు కూడా నిండిపోయాయి, దీంతో జైళ్లలోని ఖైదీలు కరోనా బారినపడకుండా.. తీవ్ర నేరాలు చేయనివారిని సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం జైళ్ల నుంచి విడుదల చేశారు. ఇప్పుడు మరోసారి సుప్రీంకోర్టు ఆ ఖైదీలపై స్పందించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ఆధారంగా కొవిడ్-19 కాలంలో హై పవర్డ్ కమిటీ ద్వారా అత్యవసర పెరోల్‌పై విడుదలైన ఖైదీలందరూ 15 రోజుల్లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. అత్యవసర పెరోల్ / మధ్యంతర బెయిల్‌పై విడుదలైన అండర్ ట్రయల్ ఖైదీలు, ఖైదీలు అందరూ 15 రోజుల్లో సంబంధిత జైలు అధికారుల ముందు లొంగిపోవాలని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
Read Also: Rahul Gandhi: భారత్ కోసం పోరాడుతున్నాం.. ఎంతవరకైనా సిద్ధం
ఖైదీలు అధికారుల ముందు లొంగిపోయిన తర్వాత మళ్లీ బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. వారి దరఖాస్తులను చట్టం ప్రకారం పరిగణించాలని బెంచ్ స్పష్టం చేసింది. తమ శిక్షను రద్దు చేయాలని కోరుతూ సంబంధిత కోర్టుల్లో కూడా పిటిషన్ వేసుకోవచ్చని తెలిపింది. కరోనా సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పడిన అత్యున్నత కమిటీ సిఫారసుల మేరకు తీవ్ర నేరాలు చేయని వారిని, విచారణ ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేశారు.