Sunil Gavaskar on Virat Kohli’s Form: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫామ్‌తో సతమతం అవుతున్నాడు. గత రెండున్నరేళ్లుగా అతడి నుంచి సెంచరీ జాలువారలేదు. దీంతో కోహ్లీపై అన్ని వైపుల నుంచి విమర్శలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే కపిల్ దేవ్ లాంటి దిగ్గజ ఆటగాడు జట్టు నుంచి కోహ్లీని తప్పించాలని డిమాండ్ చేశాడు. తాజాగా కోహ్లీ ఫామ్ అంశంపై మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. 20 నిమిషాల పాటు కోహ్లీతో మాట్లాడి అతడి బ్యాటింగ్ సమస్యలను పరిష్కరించగలనని గవాస్కర్ ధీమా వ్యక్తం చేశాడు. 20 నిమిషాల్లోనే కోహ్లీ ఆటతీరులోని లోపాల గురించి చర్చించి, వాటి నుంచి బయటపడేందుకు అతడు ఏంచేయాలో సూచిస్తానని గవాస్కర్ చెప్పాడు. ఆఫ్ స్టంప్ ఆవల పడే బంతులను ఆడబోయి అవుట్ కావడం కోహ్లీకి బలహీనతగా మారిందని.. ఈ అంశం గురించి అతడిలో చర్చిస్తానని తెలిపాడు.
తాను ఓపెనర్‌ను కాబట్టి ఆఫ్ స్టంప్ లైన్ బంతులు సృష్టించే సమస్యల పట్ల తనకు అవగాహన ఉందని సునీల్ గవాస్కర్ వెల్లడించాడు. అయితే తన సూచనలతో ఇప్పటికిప్పుడు కోహ్లీ ఆటతీరు మారుతుందని 100 శాతం చెప్పలేనని.. దానికి కొంత టైం పడుతుందని గవాస్కర్అభిప్రాయపడ్డాడు. మరోవైపు రిషబ్ పంత్, హార్డిక్ పాండ్యా జోడీపై సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. వీరిని చూస్తుంటే ధోనీ, యువరాజ్‌లను చూస్తున్నట్లు ఉందని పేర్కొన్నాడు. వీరు కొట్టిన బౌండరీలు, వికెట్ల మధ్య పరుగులు తీసిన విధానం అలానే ఉందన్నాడు. ధోనీ, యూవీ కలిసి ఎన్నో మ్యాచ్‌లను గెలిపించారని, ముఖ్యంగా 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ అందరికీ గుర్తుండిపోతుందని గవాస్కర్ తెలిపాడు. వీరి లోటును పంత్, హార్డిక్ పాండ్యా తీరుస్తారనే నమ్మకం కలుగుతోందని చెప్పాడు.