Weather Update: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్నారు. పలు ప్రాంతాల్లో ఉదయం 11 గంటల తర్వాత రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. వడగాలులు, వేడితీవ్రతకు జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇంకా రెండు మూడు రోజుల్లో ఎండలు మండిపోవచ్చని అంటున్నారు వాతావరణ నిపుణులు. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే ఇంకా రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మార్చి చివరి నాటికే ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. ఇది సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికం. కొన్ని చోట్ల ఏకంగా 43 డిగ్రీలు నమోదవుతోంది. రాత్రి పొద్దుపోయాకా కూడా చల్లబడడం లేదు. ఫలితంగా ఉక్కపోతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Read Also: AP Pensions: పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం ఫోకస్
వారం రోజులుగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి.. తాజాగా తెలుగు రాష్ట్రాలకు వడగాలుల హెచ్చరిక చేసింది వాతావరణశాఖ.. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశమున్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణలో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది.. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం 36 మండలాల్లో వడగాల్పులు, మంగళవారం 37 మండలాల్లో వడగాల్పులు, వీచే అవకాశం ఉందని పత్తుల నిర్వహణ సంస్థ ఎండr రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఆదివారం 18 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇవాళ్టి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముండడంతో.. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకు రావొద్దని సూచించారు. ముఖ్యమైన పనులుంటే ఉదయం, సాయంత్రం వేళల్లో చూసుకోవాలని చెబుతున్నారు. మధ్యాహ్నం వేళలో బయటకు వస్తే మంచి నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగాలని సూచించారు. డీహైడ్రేషన్ సమస్య తలెత్తకుండా తరుచూ మంచి నీరు తాగాలని కోరారు.