తాను ఇండియా కూటమి అభ్యర్థిని కాదని, ప్రతిపక్షాల అభ్యర్థిని అని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే ఉపరాష్ట్ర పతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అని స్పష్టం చేశారు. రాజకీయం అనే ముళ్ల కిరీటాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నారని చాలా మంది తనను అడిగారని చెప్పారు. తాను రాజకీయాల్లో ప్రవేశించలేదని, ఏ పార్టీలో సభ్యత్వం లేదని, ఇక ముందు కూడా ఉండదని పేర్కొన్నారు. పౌరహక్కులు, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతా అని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈరోజు హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో సీఎం రేవంత్ రెడ్డితో సుదర్శన్ రెడ్డి భేటీ అయ్యారు.
‘ఇదొక అపూర్వైన, అనిర్వచనీయమైన అనుభూతి. ఇంతపెద్ద బాధ్యత నేను మోయగలుగుతానా?, సఫలీకృతున్ని అవుతే అనే ఆలోచనలు వచ్చాయి. నా ప్రత్యర్థి కనబడరు, ఎక్కడున్నారు తెలియదు. అభ్యర్థులు ఇద్దరు మాట్లాడితే… సంభాషణ ఉంటే తెలుస్తుంది. నన్ను కొంతమంది మీడియా మిత్రులు అడిగారు, ఎందుకు ఈ ముల్లకిరీటం పైకి వస్తున్నారు అని. నేను ఒకటే చెప్పాను.. 53 ఏళ్లుగా భారత రాజ్యాంగతో నా ప్రయాణం సాగుతోంది. అది ప్రమాదంలో పడింది.. దాన్ని కాపాడటమే నా ధ్యేయం. రాజ్యాంగానికి నిబద్ధతతో ఉంటాను.. నిబద్దుడిగా ఉండటమే కాదు కాపాడుతాను. నా ప్రయాణానికి బ్రేక్ ఇవ్వలేదు. నేను ఏ పార్టీలో చేరలేదు. రాజ్యాంగ పరంగా ఓటు వేసే ప్రతి పౌరుడు రాజకీయాల్లో ఉంటారు. పౌర సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల నేను మాట్లాడుతాను. పౌరహక్కులు, సామాజిక న్యాయం, ఆదేశిక సూత్రాలు గురించి మాట్లాడుతాను. నన్ను ఫలానా వ్యక్తి, నేను ఫలానా అని అంటున్నారు. వనరుల సంపద ఎవరి చేతిలో కేంద్రీకృతం అవ్వకూడదు. స్త్రీ పురుషులు సమానత్వం.. అని ఆదేశిక సూత్రాలు చెబుతాయి. నేను వాటిని నమ్ముతాను’ అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి చెప్పారు.
Also Read: Revanth Reddy: వ్యక్తిగతంగా కోరుతున్నా.. తెలుగు వారు సుదర్శన్ రెడ్డి గెలుపుకు నిలబడాలి!
‘నేను ఎన్ని సవాళ్లు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. రాజ్యాంగం మసకబారుతోంది. నావంతు కాదు.. ప్రతి పౌరులు గొంతెత్తి మాట్లాడాల్సిన సందర్భం. నేను కేవలం ఇండియా కూటమి అభ్యర్థిని మాత్రమే కాదు.. నేను ప్రతిపక్షాల అభ్యర్థిని. నేను ఇండియా కూటమిలో భాగస్వామ్యం కాలేదు కానీ.. నా అభ్యర్థిత్వానికి గురించి అడిగినప్పుడు నేను రాజ్యాంగం కాపాడాలంటే పోటీ చెయ్యాలి అనుకున్నాను. SIR… అని కొత్త వ్యవస్థ వచ్చింది. ప్రపంచ ఖ్యాతి గడించిన కృష్ణ అయ్యర్.. రిజర్వాయర్ ఆఫ్ పవర్ అన్నారు. ఈ దేశంలో ప్రజలు పౌరులు అయ్యాక ఓటర్లు అయ్యారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడకపోతే.. ఓటర్ లిస్టులు మారుస్తారు. బిహార్లో జరుగుతున్న పోరాటం ప్రతిపక్షాలకు, అధికారపక్షానికి మధ్య జరుగుతుంది కాదు’ అని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలిపారు.