Story Board : తెలంగాణలో నిస్తేజంగా ఉన్న బీజేపీ శ్రేణులకు.. మోడీ స్పీచ్ కొత్త ఉత్సాహం ఇచ్చిందని కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా మోడీ చెప్పిన రెండు రహస్యాలతో బీఆర్ఎస్ పై కొత్త అనుమానాలు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ని ఆత్మరక్షణలో పడేయటం.. బీజేపీకి బూస్ట్ ఇవ్వడానికే మోడీ కీలక విషయాలు చెప్పారంటున్నారు. తాను చెప్పిన మాటలు ఎవరు నమ్ముతారు.. ఎవరు నమ్మరు అనే విషయాల్ని మోడీ పెద్దగా పట్టించుకోవడం లేదు. తన వైపు నుంచి విషయం క్లియర్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. తన దగ్గర రహస్యాలేవీ లేవు.. అంతా పారదర్శకమే అని చాటుకునే ఉద్దేశం కనిపిస్తోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికీ మెజార్టీ రాలేదని, అప్పుడు కేసీఆర్ ఢిల్లీ వచ్చి బీజేపీ మద్దతు అడిగారని చెప్పారు మోడీ. మొన్నటిదాకా బీజేపీతో ఎలాంటి సంబంధాల్లేవు.. కాషాయ పార్టీపై పోరాటమే అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్.. ఇఫ్పుడేం చెబుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మోడీ మాటలు పూర్తిగా అబద్ధమని చెప్పినా.. దాల్ మే కుఛ్ కాలా హై అనే సందేహాలు రాకమానవనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక కేటీఆర్ ను సీఎం చేద్దామనుకున్న విషయం అయితే.. బీఆర్ఎస్ లో చర్చలకు దారితీస్తుందని బీజేపీ లెక్కలేసుకుంటోంది. మోడీ మాటలతో కేసీఆర్ కేటీఆర్ కు పట్టం కట్టడం ఖాయమని తేలిపోయిందని కాషాయ పార్టీ చెబుతోంది. ఇప్పుడు కేటీఆర్ నాయకత్వాన్ని ఇష్టపడనివాళ్లు ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని హింట్ ఇస్తోంది ఆ పార్టీ. కొందరు బీజేపీ నేతలైతే మరో అడుగు ముందుకేసి బీఆర్ఎస్ రెండు ముక్కలవుతుంది, మూడు ముక్కలవుతుందని జోస్యాలు చెబుతున్నారు. వీటిలో నిజానిజాల సంగతి పక్కనపెడితే.. అసలు కేసీఆర్ కేటీఆర్ కు బాధ్యతల అప్పగింత గురించి మోడీకి ఏం చెప్పారు.. తర్వాత ఎందుకు వెనక్కుతగ్గారు.. ఇప్పుడేం అనుకుంటున్నారు.. రేపు ఎన్నికల్లో గెలిచాక ఏం చేస్తారు.. లాంటి ప్రశ్నలైతే కచ్చితంగా ఉత్పన్నమౌతాయి. వీటికి బీఆర్ఎస్ సమాధానం చెప్పుకోక తప్పదంటున్నారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ కు ఎన్నికల ప్రచారం కంటే.. ఈ ప్రశ్నలకు క్లారిటీ ఇవ్వడానికే ఎక్కువ సమయం పడుతుందని లెక్కలేసుకుంటున్నారు.
మోడీ మాటలు అతి రహస్యం బట్టబయలు అనేలా ఉన్నాయంటున్నారు కొందరు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ కేటీఆర్ కు బాధ్యతలు ఇవ్వదలుచుకున్న విషయం పార్టీలో అందరికీ తెలుసని అంటున్నారు. ఇక ఎన్డీఏలో చేరిక విషయం కూడా గతంలో చర్చకు వచ్చిందని అంటున్నారు. ఎప్పుడో జరిగిన విషయాల్ని.. ఇప్పుడు ఎన్నికల ముందు చెప్పడం ద్వారా మోడీ తన స్థాయిని తానే తగ్గించుకున్నారని మండిపడుతున్నారు. అసలు ప్రైవేట్ సంభాషణలను పబ్లిగ్గా చెప్పడం ఏం పద్ధతని ప్రశ్నిస్తున్నారు. ఇదేం పెద్ద విషయం కాదని, బీజేపీ ఎప్పటిలాగే అతిగా ఊహించుకుంటోందని భావిస్తున్నారు. మరి బీజేపీ భావించినట్టుగా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందా.. బీఆర్ఎస్ చెబుతున్నట్టుగా తేలిపోతుందా అనేది చూడాల్సి ఉంది.
మోడీది ఫక్తు ఎన్నికల ప్రసంగం. అందులో సందేహం లేదు. ఎన్నికల సందర్భంగానే సభ పెట్టారు. అప్పటికీ పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ ప్రకటనలు చేస్తే.. దింపుడు కళ్లెం ఆశ అన్నారు. కానీ రెండు టాప్ సీక్రెట్లను అదే గాటన కట్టగలరా అనేదే ఇక్కడ ప్రశ్న. ఏ వ్యూహం లేకుండా అంత ఆషామాషీగా మోడీ ఇలాంటి కామెంట్స్ చేస్తారా అనే సందేహమే రకరకాల చర్చలకు తావిస్తోంది. మోడీ మాటల లోతుల్లోకి వెళ్తే.. కచ్చితంగా అంతుచిక్కని వ్యూహాలుంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కు సమాన దూరం అని చెప్పుకుంటూ.. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు కేసీఆర్. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటున్నారు. ఈ తరుణంలో మోడీ వచ్చి కేసీఆర్ ఎన్డీఏలో చేరడానికి ప్రయత్నించారని చెప్పడం.. గులాబీ బాస్ విశ్వసనీయతను దెబ్బకొట్టే ప్రయత్నమనే వాదన వినిపిస్తోంది. అదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ కు డబ్బులు పంపారని చెప్పడం కూడా.. రాజకీయ అవకాశవాదిగా ముద్ర వేసే ప్రయత్నమే అంటున్నారు. కానీ తెలంగాణ ప్రజలు మోడీ మాటలు నమ్మి.. కేసీఆర్ పై ఓ అభిప్రాయం ఏర్పచుకుంటారా.. లేదా అనేది మరో కీలక ప్రశ్న. మోడీకి జాతీయ ఇమేజ్ ఉన్నా.. తెలంగాణలో కేసీఆర్ ముందు దిగదుడుపే అనేది బీఆర్ఎస్ భావన. అదే నిజమైతే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని బీజేపీ నిలదీస్తోంది. అయితే కౌంటర్లు ఇస్తున్నామే తప్ప.. ఎక్కడా ఇబ్బందిపడటం లేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ గతంలో కూడా ఇలాగే ఎగిరెగిరిపడి ఇప్పుడు చప్పబడిపోయిందని గులాబీ పార్టీ సెటైర్లేస్తోంది. ఇక అన్ని ప్రయత్నాలు అయిపోయాయి కాబట్టి.. స్వయంగా ప్రధాని స్థాయి తగ్గించుకుని మాట్లాడుతున్నారని ఆరోపిస్తోంది. ఏం చేసినా బీజేపీకి ఊపు రాదని జోస్యం చెబుతోంది. అదే నిజమైతే మోడీ ఏం మాట్లాడినా.. ఎందుకు పట్టించుకోవాలనేది బీజేపీ అడుగుతున్న ప్రశ్న. మోడీ ప్రసంగం తర్వాత మరోసారి రెండు పార్టీల మధ్య గతంలో మాదిరిగా మాటల యుద్ధం మొదలైంది.
తెలంగాణలో ఇంకా ఓటర్లు పార్టీలకు లాయల్ కాలేదని, సెపరేట్ ప్యాకెట్స్ గానే ఉన్నారనేది ఓ అంచనా. ఎన్నికల నాటికి ఎక్కువమందిని సందేహంలో పడేసినా.. అనుకున్న లక్ష్యం నెరవేరినట్టే అనేది బీజేపీ వ్యూహంలా కనిపిస్తోంది. పార్టీ మరీ డీలా పడితే.. పార్లమెంట్ ఎన్నికలకు ఇబ్బంది అవుతుందనే ఆలోచన కూడా ఉండొచ్చు. ఎందుకంటే బీజేపీకి అసెంబ్లీ కంటే పార్లమెంట్ ముఖ్యం. అసెంబ్లీ సీట్లు రాకపోయినా పర్లేదు కానీ.. ఎంపీ సీట్ల విషయంలో రాజీ పడటానికి సిద్ధంగా లేదు. ఎలాగో తెలంగాణ ప్రజలు అసెంబ్లీకి ఒకలా.. పార్లమెంట్ కు మరోలా ఆలోచిస్తారని గతంలో ప్రూవ్ అయింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందనే భావనతోనే మోడీ మాట్లాడారనే వాదన వినిపిస్తోంది.
ఈసారి ఒక్క పార్లమెంట్ సీటు కూడా బీజేపీకి రాదని బీఆర్ఎస్ చెబుతున్న తరుణంలో.. మోడీ స్పీచ్ తర్వాత కచ్చితంగా పరిస్థితులు మారతాయని బీజేపీ లెక్కేస్తోంది. ఇప్పటిదాకా తెలంగాణలో స్కీముల చుట్టూ తిరిగిన పాలిటిక్స్.. ఇకపై పర్దేకే పీఛే క్యా హై అనడం ఖాయమనే వాదన కూడా వినిపిస్తోంది. బీజేపీ,బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ రహస్య స్నేహితులని బీజేపీ అంటోంది. ఇప్పుడు మోడీ వచ్చి బీఆర్ఎస్ వస్తామన్నా.. తామే వద్దన్నామని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ కూడా సమాధానం చెప్పాల్సిన స్థితి వచ్చిందనేది బీజేపీ నేతల వాదన. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఏదో ఉందని ప్రజల్లోకి వెళ్లబట్టే.. మోడీ క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చిందనేది కాంగ్రెస్ మాట. మోడీ ఏం మాట్లాడినా బీఆర్ఎస్ రియాక్ట్ అవ్వాలి కానీ.. కాంగ్రెస్ కంగారు పడాల్సిన పనిలేదంటున్నారు హస్తం పార్టీ నేతలు.