తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ మంత్రి కోమటిరెడ్డి హామీతో సమ్మె విరమించినట్లు ప్రకటించింది. బంజారాహిల్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు నందిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మె విరమించి స్టోన్ క్రషర్స్ నేటి సాయంత్రం నుంచి తమ కార్యకలాపాల ప్రారంభిస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేనందున సమస్యలను పరిష్కరించలేకపోతున్నామని మంత్రి చెప్పడంతోనే తాత్కాలికంగా సమ్మెను విరమించినట్లు చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల అనంతరం సమస్యలపై సమగ్రంగా చర్చించి పరిష్కరిస్తామని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారని అన్నారు . తాము సమ్మె ప్రారంభించిన మొదటి రోజు నుంచే నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరించిన ప్రభుత్వం రెండు మూడు పర్యాయాలు తమతో మాట్లాడిందని చెప్పారు. సుమారు 20 వేల మందికి ప్రత్యక్షంగా,పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న సంస్థలపై వేధింపులు సరికావని తాము చెప్పడంతో సానుకూలంగా స్పందించిందని అన్నారు. నిర్మాణ రంగంలో కీలక భూమిక పోషిస్తున్న తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావం ఉందని వారు తెలిపారు.