గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 90శాతానికి చేరుకుంది. మరి కొన్ని గంటలలో ప్రాజెక్టు వరద గేట్లుఎత్తి గోదావరి నదిలోకి వదిలి అవకాశం ఉంది. కావున గోదావరి నదీ పరిసర ప్రాంతాలలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలెనని ముఖ్యంగా రైతులు చేపలు పట్టేవారు పశువుల కాపరులు నదిలోకి దిగవద్దని విజ్ఞప్తి చేశారు ఇంజనీర్ ఇరిగేషన్ సర్కిల్ పోచంపాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సూపరింటెండింగ్.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయవలసిందిగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మిత్రులకు పోలీస్, రెవెన్యూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.
అలాగే.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఇరిగేషన్ అధికారులు ఆదివారం నీటిని విడుదల చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఎస్‌ఆర్‌ఎస్‌పి, కడాం ప్రాజెక్టుల నుంచి ఇన్‌ఫ్లోలు కురుస్తున్న నేపథ్యంలో వరద గేట్లను ఎత్తి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. 62 గేట్లకు గాను 20 గేట్లను ఎత్తి 1.7 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి భారీగా ఇన్‌ఫ్లోలు వస్తున్నాయి. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి 11000 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతుండగా, కడాం ప్రాజెక్టు నుంచి 4 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలకు గానూ 18 టీఎంసీలకు చేరుకుంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామస్తులను అప్రమత్తం చేశారు. ప్రజలు నదిలోకి వెళ్లవద్దని సూచించారు. మరోవైపు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు సుందిళ్ల, అన్నారం బ్యారేజీల గేట్లన్నీ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపెల్లి వద్ద రాళ్లవాగులో ఆదివారం రాత్రి మినీ గూడ్స్ క్యారియర్ కొట్టుకుపోయింది. వాహనంలో సుమారు ఆరుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారని, డ్రైవర్ వాగుకు అడ్డంగా ఉన్న వంతెనను దాటడానికి ప్రయత్నించడంతో వాహనం వరద నీటిలో కొట్టుకుపోయి చెట్టుకు చిక్కుకుందని చెప్పారు. స్థానికులు తాళ్ల సహాయంతో గల్లంతైన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.