తలనొప్పికి… కాలు నొప్పికి ఒకే మాత్ర పనికిరాదు నాయనా…! మాటైనా, మాత్ర అయినా సందర్భానికి, అవసరానికి తగ్గట్టుగా ఉండాలే తప్ప అన్నిటీకీ దూకుడు మంత్రం పనికిరాదని వైసీపీ నాయకత్వం ఆ మంత్రికి తలంటిందట. కాస్త వెనకా ముందూ చూసుకుని మాట్లాడమని స్మూత్ వార్నింగ్ ఇచ్చిందట. ప్రతి విషయంలో కౌంటర్‌కి ఎన్‌కౌంటర్ వర్కవుట్ కాదని కూడా చెప్పిందట. ఇంతకీ ఎవరా ఏపీ మంత్రి? ఏ విషయంలో తగ్గి మాట్లాడమని అధిష్టానం చెప్పింది?
శ్రీకాకుళం జిల్లాలో హేమా హేమీలను కాదని మంత్రి పదవి దక్కించుకున్నారు సీదిరి అప్పలరాజు. మెదటిసారి ఎమ్మెల్యే అయినా అమాత్యునిగా అవకాశం కొట్టేశారు. అగ్రెసివ్‌గా మాట్లాడితేనే వైసీపీ అధిష్టానం గుర్తిస్తుందని అనుకుంటారో… లేక నేనింతే… అన్నట్టుగా మాట్లాడతారోగాని….రాజకీయ ప్రత్యర్థుల విషయంలో చెలరేగిపోతుంటారు మంత్రి. కాస్త తన గ్రాఫ్ పెంచుకోవాలనుకున్నప్పుడల్లా హాట్ కామెంట్స్ చేస్తుంటారన్న ఇంటర్నల్ టాక్ కూడా ఉందట. అలాంటి సీదిరి ఈసారి తెలంగాణ నాయకుల విషయంలో నోరుజారి వైసీపీ నాయకత్వంతో తలంటించుకున్నారట. ఏంటా మాటలు అంటూ సీరియస్ అయిందట. తెలంగాణలో మళ్లీ దొరల పాలన వచ్చిందని అంటూ… దానికి మరికొన్ని అనవసర వ్యాఖ్యానాలు జోడించారట సీదిరి. ఆ మాటల్ని సీరియస్‌గా తీసుకున్న వైసీపీ నాయకత్వం సున్నితమైన విషయాల్లో మరీ అంత దూకుడొద్దమ్మా…. అంటూ బ్రేకులేసిందట. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం సీదిరి అలా మాట్లాడి ఉండకూడదన్నారట.
అధిష్టానం అక్షింతలంటూ మేటర్ సోషల్ మీడియాకెక్కడంతో…నష్టనివారణ చర్యలు చేపట్టారట హల్‌చల్ మినిస్టర్. తనకేమీ వ్యక్తిగత ఎజెండా లేదని , రాష్ర్ట ప్రయోజనాల కోసమే అలా మాట్లాడానని కవరింగ్ ఇచ్చుకుంటున్నారట. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదంటూనే.. ఆంధ్రుల మనోభావాలు దెబ్బతీస్తే ఎలాగని అడుగుతున్నారట. మంత్రి వ్యాఖ్యల మీద జిల్లాలో మిశ్రమ స్పందన వస్తోంది. అధిష్టానం పెద్దలు స్పీడ్ కు కాస్త బ్రేకులు వేయాలని చెబుతుంటే , క్రిందిస్దాయి లీడర్స్ మాత్రం మంత్రి వ్యాఖ్యలు తెలంగాణ నేతలకు సరైన కౌంటర్ గానే చెప్పుకుంటున్నారట. మొత్తం మీద మంత్రి సీదిరి మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసుకోవాలని సూచిస్తున్నారంట అధిష్టానం పెద్దలు . విమర్శల్ని తిప్పికొట్టడం తప్పుకాదు గానీ…మరీ శృతి మించి బోర్డర్ లైన్ దాటొద్దని ఆదేశించిందట.