Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, శశిథరూర్‌లు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఖర్గేకు అధిష్ఠానంతో పాటు సోనియా సపోర్టు ఉందని కొంత కాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా అధ్యక్ష పదవికి ఆయన పేరును స్వయంగా సోనియానే సూచించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలన్నీ వాస్తవం కాదని, వదంతులేనని తీవ్రంగా ఖండించారు ఖర్గే. సోనియా గాంధీ తన పేరును సూచించలేదని, అంతర్గతంగా సోనియా నుంచి ఎలాంటి మద్దతు లేదని ఆయన స్పష్టం చేశారు. కొందరు కాంగ్రెస్ పార్టీని, సోనియాను, తనను అప్రతిష్ట పాలు చేసేందుకు పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని చెప్పారు. సోనియా ఎన్నికల్లో ఎవరికీ మద్దతు తెలపనని స్పష్టం చెప్పినట్లు ఆయన వెల్లడించారు.
MIG 29K Jet Crash: గోవా తీరంలో కుప్పకూలిన మిగ్ 29కె యుద్ధ విమానం
ప్రస్తుతం దేశంలో పరిస్థితులు సరిగా లేవని.. మోడీ, అమిత్ షా రాజకీయాల వల్ల ప్రజాస్వామ్యం కుంటుపడుతోందని ఖర్గే విమర్శించారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై పోరాడేందుకు తగిన శక్తి కావాలని, కాంగ్రెస్ ప్రతినిధుల సిఫారసు మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు తనకు పోటీగా నిలబడిన శశథరూర్‌పై మల్లిఖార్జున్ ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అధికార వికేంద్రీకరణ దిశగా వెళతానన్న శశిథరూర్ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ఆయనతో తనను పోల్చవద్దన్నారు. తాను బ్లాక్ అధ్యక్షుడి నుంచి ఈ స్థాయికి ఎదిగానని.. ఆ సమయంలో శశథరూర్ ఉన్నారా అని ప్రశ్నించారు. శశి థరూర్ తన మేనిఫెస్టోతో ముందుకెళ్లవచ్చని, తాను మాత్రం ఉదయ్ పూర్ డిక్లరేషన్‌లో తీసుకున్న నిర్ణయాల అమలు అజెండాగా పనిచేస్తానన్నారు. సీనియర్ నేతలు, నిపుణులతో సంప్రదింపులు చేపట్టడం ద్వారా నిర్ణయాల అమలు దిశగా చర్య చేపడతామన్నారు.