రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఆస్తుల కోసం అయినవారిని అంతమొందిస్తున్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మళ్లీ మళ్లీ నిరూపిస్తు్న్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లా కొండపాక (మం) తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం చిన్నల్లుడు అత్తను హత్య చేశాడు. భర్త చనిపోవడంతో ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేసి ఒంటరిగా ఉంటున్న రాములమ్మ ( 55). ఆరు నెలల క్రితం తన పేరుపై ఉన్న రెండున్నర ఎకరాల భూమిని ఇద్దరు కూతుళ్లకి సమానంగా పంచుతానని రాములమ్మ చెప్పింది. భూమి మొత్తం తనకే దక్కాలని అల్లుడు జీవన్ రెడ్డి అత్తపై కక్ష పెంచుకున్నాడు. మధ్యాహ్నం జీవన్ రెడ్డి అత్తింటికి స్నేహితులతో కలిసి వచ్చాడు.
Also Read:Maa Inti Bangaram: మీరు చూస్తా ఉండండి.. సంక్రాంతికి సమంత సర్‌ప్రైజ్!
ఎవరికి అనుమానం రాకుండా స్నేహితులతో కలిసి టవల్ తో గొంతు పిసికి నోట్లో గుడ్డలు కుక్కి అత్తని హత్య చేశాడు అల్లుడు. అనంతరం చెవిలోని కమ్మలు తీసుకొని పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు రాములమ్మ మృతి చెందినట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే మృతురాలి కూతుర్లు అక్కడికి చేరుకున్నారు. వాళ్లతో పాటు ఎవ్వరికీ అనుమానం రాకుండా బట్టలు మార్చుకుని వచ్చి అల్లుడు దొంగ ఏడుపు ఏడ్చాడు. కుమార్తెల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలో చూడగా అల్లుడి బాగోతం బయటపడింది. అల్లుడు జీవన్ రెడ్డి అత్తను హత్య చేసినట్లు గుర్తించారు. జీవన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.