Somu Veerraju: గన్నవరంలో ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.. ఛార్జ్ షీట్ కార్యక్రమం అమలుపై సమీక్ష జరుగుతోంది.. నేతల పనితీరుపై చర్చ ఉండగా.. పొత్తులపై పవన్ ప్రకటన, సొంత పార్టీ నేతల కామెంట్లపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.. అయితే, ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇవాళ పొత్తులపై చర్చ లేదు.. అధిష్టానానికి అన్నీ వివరించామని స్పష్టం చేశారు.. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుల విషయంలో పవన్ కల్యాణ్ వరుసగా కామెంట్లు చేస్తూ వస్తున్నారు.. అయితే, ఈ సమావేశంలో పొత్తులపై చర్చ జరగడం లేదంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించడం చర్చగా మారింది.
ఇక, అకాల వర్షాల వల్ల ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగిందో ప్రభుత్వం ప్రకటించడం లేదని వాపోయారు సోమువీర్రాజు.. కేంద్రం గోనె సంచులు ఇస్తోన్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పాత సంచులను రైతులకు ఇస్తోందని.. జగన్ ప్రభుత్వం గోనె సంచుల కుంభకోణానికి పాల్పడుతోందని ఫైర్ అయ్యారు. కేంద్రం రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించినా.. రాష్ట్రం మిల్లర్లకు కొమ్ము కాస్తూ దోపిడీకి సహకరిస్తుంది.. ఏపీలో ధాన్యం కొనుగోళ్లల్లో ప్రతేడాది రూ. 1000 కోట్ల కుంభకోణం జరుగుతోంది.. ఆర్బీకేలు రైతు దోపిడీ కేంద్రాలుగా మారాయి.. టిడ్కో ఇళ్లను కేంద్రం కేటాయించినా లబ్దిదారులకు ఇళ్లను ఇవ్వడం లేదు.. అవభూముల్లో భారీ కుంభకోణం జరిగుతోంది.. ప్రభుత్వం చేస్తోన్న తప్పిదాలను.. ప్రభుత్వం అక్రమాలను ఛార్జ్ షీట్ల దాఖలు కార్యక్రమంలో చేపట్టాలి. ఈ ప్రభుత్వానికి బ్రాందీ మీదున్న అవగాహన ఆయుష్ మీద లేకపోవడం బాధాకరం అంటూ ఫైర్ అయ్యారు.
విభాగాల వారీగా.. మోర్చాల వారీగా ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తామని వెల్లడించారు సోము వీర్రాజు.. ఎమ్మెల్యేల అవినీతిపై ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తున్నాం.. కావలి ఎమ్మెల్యే అవినీతిపై సీఎంకు ఫిర్యాదు చేయాలని ప్రయత్నిస్తే పోలీసులు దారుణంగా అడ్డుకున్నారని మండిపడ్డారు. బీజేపీ నేత సురేష్ తలను కాళ్ల మధ్యలో నొక్కి పెట్టిన దారుణం చూశాం.. పోలీసుల దమనకాండపై గవర్నర్‌ను కలుస్తామని వెల్లడించారు. వనరుల దోపిడీ పెద్ద ఎత్తున జరుగుతోంది. బ్రాందీలను తయారు చేసేస్తున్నారు.. బ్రాండ్ల పేరు కూడా చెప్పడం లేదు.. గుర్తుండకుండా చేస్తున్నారని విమర్శించారు. బొప్పాయి ముక్కల అమ్మే బండి మీద ఆన్ లైన్ పేమెంట్లు జరుగుతోంటే.. జగన్ బ్రాందీ షాపుల్లో మాత్రం ఆన్ లైన్ ఉండడం లేదని ఎద్దేవా చేశారు.
మరోవైపు.. కరెంట్ కోతలు పెరిగాయి.. ప్రజా కార్యక్రమాలు.. రాబరీ కార్యక్రమాలుగా మారాయని విమర్శించారు వీర్రాజు.. సీఆర్డీఏలో ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలంట.. మిగిలిన చోట్ల ఇళ్లు త్వరగా కట్టక్కర్లేదా..? అని నిలదీశారు. సీఆర్డీఏలో ఏంటీ కవ్వింపు చర్యలేంటీ..? ఎందుకీ వర్గ రాజకీయాలు..? 22 లక్షల ఇళ్లను కేంద్రం ఇస్తే.. కేవలం 8 లక్షల ఇళ్ల పనులనే మొదలు పెడతారా..? మిగిలిన ప్రాంతాల్లో ఇళ్లు కట్టలేని ఈ ప్రభుత్వం సీఆర్డీఏలో ఇళ్లు కడుతుందా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక, వీఆర్ఎస్ తీసుకోవాల్సిన పార్టీ బీఆర్ఎస్ పెట్టింది… ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పెడతారట.. పార్టీ కార్యాలయం పెడతారట.. అయినా, ఏపీలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటామని ప్రకటించారు.. ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 30వ తేదీ వరకు నరేంద్ర మోడీ విధానాలపై ప్రచారం చేస్తామని.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నెల రోజుల పాటు ఎండగడతామన్నారు. ఇంకో వైపు.. మీడియా ప్రతినిధులపై ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు చేసిన దాడిని ఖండించారు సోమువీర్రాజు.. అవినాష్ రెడ్డి అనుచరులు దాష్టీకాన్ని అందరూ అడ్డుకోవాలన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వం పెద్దలు మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు సోము వీర్రాజు.