17 ఏళ్ల వయసులోనే తన తండ్రి దూరమైనట్లు, అప్పటినుంచి ఆయన జ్ఞాపకాలతోనే జీవిస్తున్నట్లు హీరో శివ కార్తికేయన్ తెలిపారు. తన తండ్రి మరణించిన అనంతరం తాను ఎన్నో బాధలు పడినట్లు చెప్పారు. ‘అమరన్’ సినిమా చేయడానికి ప్రధాన కారణం తన తండ్రే అని భావోద్వేగానికి గురయ్యారు. మేజర్ ముకుంద్ వరదరాజన్‌కు, తన నాన్నకు మధ్య చాలా పోలికలు ఉన్నాయని శివ కార్తికేయన్ చెప్పుకొచ్చారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటించిన చిత్రం అమరన్. అక్టోబర్ 31న రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు వసూల్ చేసింది.
అమరన్ విజయోత్సవ సభలో శివ కార్తికేయన్ తన తండ్రిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. శివ కార్తికేయన్ మాట్లాడుతూ… ‘మా నాన్న నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్. ప్రతిఒక్కరు ఆయనను ఎంతో గౌరవించేవారు. అమరన్ చేయడానికి ప్రధాన కారణం నాన్నే. గత 21 ఏళ్లుగా నేను ఆయన జ్ఞాపకాలతో బతుకుతున్నా. అమరన్‌లో నేను మా నాన్నను చూసుకున్నా. నా మొదటి హీరో నాన్నే. చిన్నపుడు నాన్న షూ పాలిష్ చేయడం, బ్యాడ్జీ సిద్ధం చేసేవాడిని. అమరన్‌లో ఆయన లానే నటించా. మేజర్ ముకుంద్ వరదరాజన్‌కు, మా నాన్నకు మధ్య చాలా పోలికలు ఉన్నాయి’ అని తెలిపారు.
Also Read: IPL Auction 2025: మెగా వేలంలో భారత స్టార్ ఆటగాళ్లు.. కనీస ధర ఎంతంటే?
‘నాకు 17 ఏళ్లు ఉన్నప్పుడు మా నాన్న మరణించారు. 2 రోజుల సెలవుపై ఇంటికి వస్తానని నాన్న నాకు ఫోన్ చేసి చెప్పారు. చివరకు అంబులెన్స్‌లో ఐస్ బాక్స్‌లో ఇంటికి వచ్చారు. అంత్యక్రియలు అయ్యాక ఆయన ఎముకలు మాత్రమే మిగిలాయి. వాటిని చూసి నా గుండె బద్దలైంది. ఎంతో ఏడ్చాను. అప్పటినుంచి నాన్న జ్ఞాపకాలతో జీవిస్తున్నా’ అని శివ కార్తికేయన్ చెప్పారు. శివ కార్తికేయన్ తండ్రి పేరు జి దాస్. ఆయన జైలు సూపరింటెండెంట్. శివకు 17 ఏళ్ల వయసు ఉన్నపుడు జి దాస్ మరణించారు.