SIT investigation: ఏపీలో ఎన్నికల సమయంలో ఘర్షణలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలోనే సిట్ అధికారులు మకాం వేసింది. అవసరమైతే మరోసారి అల్లర్లు జరిగిన ప్రాంతానికి సిట్ టీమ్ వెళ్లనుంది. జిల్లాల్లో పోలీసులు కేసులు విచారిస్తున్న తీరుపై సిట్ మరో నివేదిక ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. పోలింగ్ తర్వాత అల్లర్లలో పాల్గొన్న వారిపై సిట్ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.
Read Also: Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఇంతలా కష్టపడిందా.. ప్రాక్టీస్ వీడియో వైరల్!
దీంతో అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనపై సిట్ బృందం దర్యాప్తు కొనసాగుతుంది. కేసుల వివరాలు, నిందితుల గుర్తింపులాంటి అంశాలపై పరిశీలిస్తున్నారు. గొడవలకు గల కారణాలను పూర్తి స్థాయిలో విచారించి నివేదిక సిద్ధం చేసే పనిలో సిట్ బృందం ఉంది. మరో వైపు తాడిపత్రి అల్లర్ల ఘటనలో అరెస్టులు కొనసాగుతున్నాయి. కాగా, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు టీడీపీ అభ్యర్థి జేసి అస్మిత్ రెడ్డిలకు కూడా హైకోర్టులో ఊరట దక్కింది. జూన్ 6వ తేదీ వరకు అరెస్టు చేయవద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గంలోకి వెళ్ళ వద్దంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డికి న్యాయస్థానం సూచించింది. తాడిపత్రిలో కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు సిట్ అధికారులు జిల్లాలోనే మకాం వేయనున్నారు. ఇప్పటికే 639 మంది అల్లర్లు , రాళ్లదాడిలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, 102 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అల్లర్లలో పాల్గొన్న నిందితులందరూ ఇతర రాష్ట్రాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను అరెస్టు చేయడానికి చర్యలు వేగవంతం చేసిన పోలీసు అధికారులు.. కౌంటింగ్ రోజు తాడిపత్రిలోకి బయట వారు రాకుండా అష్టదిగ్బంధం చేయడానికి అధికారుల కసరత్తు చేస్తున్నారు.