CM Revanth Reddy : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిజరూప దర్శనం కోసం వేచి ఉన్న భక్తులపై అకస్మాత్తుగా గోడ కూలడంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన భక్తులను పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటన భక్తజనంలో తీవ్ర ఆవేదనకు కారణమైంది. విషాదకర ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. “ఆంధ్ర ప్రదేశ్ లోని సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదనను కలిగించింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.” అని అన్నారు. విశాఖపట్నం జిల్లాలో ఘనంగా జరుగుతున్న చందనోత్సవం సందర్భంగా స్వామివారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు.
దీనికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వందలాది మంది భక్తులు రూ.300 క్యూలైన్‌లో నిల్చొని స్వామి దర్శనానికి వేచి ఉన్న సమయంలో, రాత్రి సమయంలో కురిసిన భారీ వర్షంతో ఆలయం ప్రాంగణంలోని ఓ గోడ కూలిపోయింది. తెల్లవారు జామున 3 గంటల సమయంలో గోడ కూలినట్టు సమాచారం. ప్రమాద సమయంలో క్యూలైన్లలో ఉన్న భక్తులు ఎటువైపు వెళ్లాలనే అప్రతిష్ఠ పరిస్థితుల్లో చిక్కుకున్నారు. గోడ నేరుగా వారి తలలపై పడిన కారణంగా మృతదేహాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే NDRF బృందాలు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. మృతదేహాలను బయటకు తీశారు. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలానిక చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.