Site icon NTV Telugu

Hyderabad: అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటనలో నిందితుల గుర్తింపు

Hyder

Hyder

Hyderabad: కర్ణాటకలోని బీదర్‌ నగరంలోని శివాజీ చౌక్‌లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై దొంగలు కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. బైక్ పై వచ్చిన ఇద్దరు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఇక దాడి చేసిన వ్యక్తులు ఏటీఎం డబ్బును బ్యాగులో వేసుకుని.. ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పారిపోయిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఆ దోపిడీ దొంగలు హైదరాబాద్ నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో ఉన్నట్టు తెలుసుకున్న బీదర్‌ పోలీసులు వారిని పట్టుకునేందుకు హైదరాబాద్‌ నగరానికి వచ్చారు.

Also Read: Hyderabad: షార్ట్ సర్క్యూట్ దెబ్బకి ఇద్దరు మృతి

ఈ నేపథ్యంలో అప్జల్‌గంజ్‌ ప్రాంతంలో పోలీసులను చూసిన దొంగల ముఠా.. అక్కడినుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కాల్పులు జరిపారు. ఆపై రోషన్‌ ట్రావెల్స్‌ కార్యాలయంలోకి వెళ్లిన దుండగులు ట్రావెల్స్‌ మేనేజర్‌ పైన కాల్పులు జరిపి, అఫ్జల్‌గంజ్‌ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వచ్చారు. అయితే అక్కడి నుంచి ఎటు వెళ్లారన్న విషయాన్ని పోలీసులు గాలిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సంఘటనకు సంబంధించి నిందితులను గుర్తించినట్లుగా సమాచారం అందింది.

Also Read: Transport Deportment: ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా ఝళిపించిన రవాణా శాఖ

ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితులలో ఒకరు బిహార్‌కి చెందిన మనీష్‌గా గుర్తించబడ్డాడు. మనీష్‌తో కలిసి ఇతర వ్యక్తులు కూడా దోపిడీలకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ నిందితులు వారం క్రితం నుండి వివిధ ప్రాంతాల్లో దోపిడీలను నిర్వహించినట్లు సమాచారం. వీటిలో కొన్ని ఛత్తీస్‌గఢ్‌, బీదర్ ప్రాంతాలలోనూ దోపిడీలు జరిగాయి. గతంలో కూడా మనీష్‌పై హత్య, దోపిడీ కేసులు నమోదయ్యాయి. అతనిపై బిహార్‌ ప్రభుత్వం రివార్డు కూడా ప్రకటించింది. ప్రస్తుతం, మనీష్‌పై వేటకు కృషి చేస్తున్న పోలీసులు నాలుగు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణ, బిహార్‌, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో మనీష్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

Exit mobile version