PM Modi: మోడీ సర్కారుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ స్పందించడంతో ప్రతిపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. వాకౌట్‌పై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ప్రశ్నలు లేవనెత్తే వారికి సమాధానాలు వినే ధైర్యం లేదంటూ ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పి విపక్షాలు పారిపోతున్నాయని మోడీ చురకలంటించారు. మణిపూర్‌పై చర్చ విపక్షాలకు అవసరం లేదని.. మణిపూర్‌పై అమిత్ షా పూర్తి వివరాలు అందించారన్నారు. మేం చర్చకు ఆహ్వానిస్తే వారు వెళ్లిపోయారంటూ మండిపడ్డారు. మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. ఈ అంశం కోర్టులో ఉందని, సమీప భవిష్యత్తులో ఈశాన్య రాష్ట్రంలో శాంతి నెలకొంటుందని అన్నారు. మణిపూర్ కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని అన్నారు. అభివృద్ధి జరుగుతుందని మణిపూర్ ప్రజలకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు
Also Read: No Confidence Motion: కాంగ్రెస్‌పై భారత్‌కు అవిశ్వాసం ఉంది.. ప్రధాని మోడీ ఫైర్
రాహుల్ గాంధీపై ప్రధాని విరుచుకుపడ్డారు. “కొందరు ఎందుకు భారతమాత చావు కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు. వీళ్లే రాజ్యాంగం హత్య గురించి మాట్లాడుతారు. వాళ్ల మనసులో ఉన్నదే ఇప్పుడు బయటపడుతోంది.” అని ప్రధాని మోడీ మండిపడ్డారు. భారత మాతను రక్షించాల్సిన వాళ్లే భుజాలు నరికేశారన్నారు. బుధవారం రాహుల్ లోక్‌సభలో మాట్లాడుతూ.. ప్రధాని దృష్టిలో మణిపూర్ దేశంలో లేదని.. మణిపూర్‌లో భరత మాతను హత్య చేశారని రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మీరు దేశ భక్తులు కాదు.. దేశ ద్రోహులు.. మణిపూర్ ప్రజలను చంపడం ద్వారా దేశాన్ని కూడా చంపారని ఆరోపించారు. హిందుస్తాన్‌ను మర్డర్ చేశారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ హిందుస్తాన్ మాట వినరని, కేవలం ఇద్దరి మాటే వింటారని ఫైర్ అయ్యారు. లంకను కాల్చింది రావణుడి అహంకారమే అంటూ వ్యాఖ్యలు చేశారు రాహుల్. ఈ నేపథ్యంలో ప్రధాని రాహుల్‌పై మండిపడ్డారు.
Also Read: PM Modi: విపక్షాలకు ప్రధాని ధన్యవాదాలు.. 2028లో మరో అవిశ్వాస తీర్మానమంటూ జోస్యం
కాంగ్రెస్ దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తోందని మోడీ విమర్శించారు. మిజోరంపైనా దాడులు చేయించారని. 1966లో మిజోరంలోని సామాన్యులపై దాడులు చేయించారని ఆయన పేర్కొన్నారు. ఈశాన్యం అభివృద్ధిని నెహ్రు అడ్డుకుంటారని లోహియా ఈ విషయాన్ని దాచారన్నారు. ఇందిరా హయాంలో మిజోరంపై జరిగిన దాడిని ఇప్పటికీ దాచారని ఆయన పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కాంగ్రెస్ విస్మరించిందన్నారు. ఇప్పటివరకు 50సార్లు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించానని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 1962 నాటి నెహ్రు ప్రసంగం నేటికి ఈశాన్య రాష్ట్రాల మనసుల్ని గుచ్చుకుంటుందన్నారు. మిజోరం మార్చి 5వ తేదీని ఇప్పటికీ నిరసన దినంగా పాటిస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. మణిపూర్‌లో సాయంత్రం 4 గంటలు దాటాక గుళ్లు, మసీదులు మూసేసేవారని.. ఈ పాపం కాంగ్రెస్ వాళ్లది కాదా అంటూ ప్రశ్నించారు.