HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. శివ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ అరెస్టు ఎసీబీ అధికారులు. మూడు రోజులపాటు నవీన్ కుమార్ విచారించిన తరువాత ఏసీబీ ఆయనను అరెస్టు చేసింది. నవీన్ కుమార్ బినామీగా ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ, బాలకృష్ణకు బినామీగా ఉండి ఆస్తులను కూడబెట్టినట్టు గుర్తించారు. ఇప్పటికే శివ బాలకృష్ణ ను ఎనిమిది రోజుల కస్టడీలో భాగంగా ప్రశ్నిస్తోంది ఏసీబీ బృందం. ఇప్పడు ఆయన సోదరుడిని అరెస్ట్ చేయడంతో సంచలనంగా మారింది.
అయితే.. దాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసులో రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఆరు రోజులుగా ఆయనను అధికారులు విచారిస్తున్నారు. తాజా దర్యాప్తులో శివబాలకృష్ణకు భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆయన సోదరుడు నవీన్, మేనల్లుడు భరత్ పేరు మీద ఆస్తులు ఉన్నాయని విచారణలో వెలుగులోకి వచ్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 150 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు 15 ఓపెన్ ప్లాట్లను కూడా గుర్తించినట్లు వెల్లడించారు. ఇవే కాకుండా నల్గొండ, మహబూబ్‌నగర్, జనగామ జిల్లాల్లో శివబాలకృష్ణకు ఆస్తులున్నాయని తెలుసుకున్నట్లు వివరించారు.
గత నెల 24వ తేదీన శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ రోజే రూ.100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. అందులో రూ.40 లక్షల నగదు, రెండు కిలోల బంగారు ఆభరణాలు, ఆస్తిపత్రాలు, బ్యాంకు డిపాజిట్లు, ఖరీదైన 60 చేతి గడియారాలు తదితర వస్తువులను అధికారులు గుర్తించారు. దీంతో ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికి ఏడు రోజులు ముగిసింది.