Shashi Tharoor: పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న ఉగ్రవాదం గురించి ప్రపంచ వ్యాప్తంగా ఎండగట్టడానికి భారత్ అఖిలపక్షంతో కూడి ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది. దేశంలోని పలు పార్టీలకు చెందిన ఎంపీలు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఎలా మద్దతు ఇస్తుందనే అంశాన్ని విదేశాలకు వీరు చెప్పనున్నారు. అయితే, ఇప్పుడు ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ని ఎంపిక చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారం థరూర్, కాంగ్రెస్ మధ్య విభేదాలను స్పష్టంగా చూపిస్తుంది.
అయితే, విదేశాలకు వెళ్తున్న ప్రతినిధి బృందానికి సంబంధించి నాలుగు పేర్లు సూచించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మే 16 ఉదయం కాంగ్రెస్‌ని కోరారు. కాంగ్రెస్ మాజీ క్యాబినెట్ మినిస్టర్ ఆనంద్ శర్మ, లోక్‌సభలో ఉప ప్రతిపక్ష నాయకుడు గౌరవ్ గొగోయ్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్, లోక్ సభ ఎంపీ రాజా బ్రార్ పేర్లను సూచించింది. కానీ, కేంద్రం మాత్రం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కే ఓటేసింది. థరూర్‌ని ఒక అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ప్రకటించింది.
Read Also: India-Pakistan: పాకిస్థాన్‌పై దౌత్య యుద్ధానికి భారత్ సిద్ధం.. ఏడు అఖిలపక్ష బృందాల ఏర్పాటు..
థరూర్‌తో పాటు బిజెపి నాయకులు రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, జనతాదళ్ (యునైటెడ్) ఎంపి సంజయ్ కుమార్ ఝా, డిఎంకెకు చెందిన కనిమొళి కరుణానిధి, ఎన్‌సిపి (శరద్ పవార్ వర్గం) నాయకురాలు సుప్రియా సులే, శివసేన (షిండే వర్గం) ఎంపి శ్రీకాంత్ షిండే ఈ అఖిలపక్ష బృందాలకు నాయకత్వం వహిస్తారు. తన ఎంపికపై శశి థరూర్ మాట్లాడుతూ.. ‘‘జాతీయ ప్రయోజనాల కోసం నా సేవలు అవసరమైనప్పుడు ముందుంటాను’’ అని ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ సూచించిన నలుగురి పేర్లను పట్టించుకోకుండా కేంద్రం థరూర్‌ని ఎంపిక చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్రమోడీపై, ఆపరేషన్ సిందూర్‌పై థరూర్ ప్రశంసలు కురిపించారు. పలు కార్యక్రమాల్లో మోడీతో కలిసి పాల్గొన్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీలో కొంత మంది థరూర్ ‘‘లక్ష్మణ రేఖ’’ దాటారంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం మే 23 నుండి 10 రోజుల దౌత్య మిషన్‌ను ప్రారంభిస్తుంది, వాషింగ్టన్, లండన్, అబుదాబి, ప్రిటోరియా, టోక్యో వంటి కీలక రాజధానులను సందర్శిస్తుంది. ఉగ్రవాదంపై భారత్ ‘‘జీరో టాలరెన్స్’’ విధానం గురించి, పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న విషయాన్ని, ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడిని, భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి వివరిస్తారు.