లోక్ సభ ఎన్నికలకు గాను మహారాష్ట్రలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(శరద్ పవార్) తన ఎన్నికల మేనిఫెస్టోను ఇవాళ (గురువారం) విడుదల చేశారు. శపత్నామా పేరుతో రిలీజ్ చేసిన ఈ మేనిఫెస్టోలో ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే, రైతుల సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తామన్నారు. జమ్మూ & కశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర స్థాయి హోదాకు సపోర్టు ఇస్తామని పేర్కొన్నారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు ఆయన క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా పౌరసత్వ సవరణ చట్టం(CAA), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC), చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) లాంటి చట్టాలను సమీక్షించి వాటిలో మార్పులు చేసి తీసుకొస్తామని శరద్ పవార్ వెల్లడించారు.
ఇక, రాష్ట్ర- స్థానిక ప్రభుత్వాలకు అధికారం కల్పించడం, విద్యుత్ పంపిణీని సమీక్షించడం, రాజ్యాంగ సవరణలను అమలు చేయడం లాంటి అంశాలను కూడా ఎన్సీపీ పార్టీ సమర్థిస్తున్నట్టు ఆ పార్టీ నేత జయంత్ పాటిల్ చెప్పుకొచ్చారు. అగ్నిపథ్ పథకాన్ని పూర్తిగా రద్దు చేస్తామని తెలిపారు. రైతులు, యువకులు, మహిళలు, కార్మికులు, కుల గణనకు సంబంధించిన సమస్యలపై కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఐదు హామీలను తాము ఆమోదిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. పెట్రోలు, డీజిల్‌పై పన్నును పునర్ వ్యవస్థీకరిస్తామని హామీ ఇచ్చారు.