RGIA : హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఇటీవల విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో ప్రయాణికుల కష్టాలు పెరిగిపోతున్నాయి. గమ్యస్థానాలకు సరిగ్గా చేరాల్సిన విమానాలు గంటల తరబడి ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. తాజాగా మరోసారి స్పైస్‌జెట్ విమానం ఆలస్యం కావడం విమానాశ్రయంలో కలకలం రేపింది.
ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో మూడు గంటలుగా ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు విమానం బయలుదేరుతుందా అని ఎదురుచూస్తూ అలసిపోయిన ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో ఆందోళనకు దిగారు. విమాన సిబ్బంది కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంతో ప్రయాగ్‌రాజ్ వెళ్లే ప్రయాణికులు మండిపడుతున్నారు.
ఇదే నెలలో ఇదే స్పైస్‌జెట్ విమానం ఐదున్నర గంటల పాటు ఆలస్యమైన సంఘటన ఇంకా మరిచిపోక ముందే మరోసారి ఈ తరహా ఆలస్యాలు చోటుచేసుకోవడం విమానయాన సంస్థల నిర్లక్ష్యాన్ని అర్థమయ్యేలా చేస్తోంది. ఫిబ్రవరి 7న ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సిన విమానం పలు కారణాలతో ఐదున్నర గంటలు ఆలస్యం అవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 10:30 గంటలకు బయలుదేరాల్సిన విమానం సాయంత్రం అయ్యే సరికి గమ్యస్థానానికి చేరలేదు. దీనిపై నిరసన వ్యక్తం చేసిన ప్రయాణికుల్లో హీరో విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ ప్రముఖులు, ఇద్దరు ఐఏఎస్‌లు, ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. “గంటల తరబడి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మా సమయాన్ని వృథా చేస్తున్నారు!” అంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక అంతకు ముందు రోజు మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గుహవాటి వెళ్లాల్సిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వేపైకి వెళ్లాక ఇంజిన్ మొరాయించింది! పైలెట్ అప్రమత్తమై వెంటనే ఏటీసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇంజనీరింగ్ నిపుణులు వెంటనే రంగంలోకి దిగారు. దాదాపు గంట పాటు లోపాన్ని సరిచేయడానికి ప్రయత్నించి ఎట్టకేలకు విమానాన్ని మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చారు. కానీ రన్‌వేపైకి వెళ్లిన విమానం తిరిగి పార్కింగ్ బే వైపు రావడంతో ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. చివరకు గంటన్నర ఆలస్యంగా విమానం గమ్యస్థానానికి బయలుదేరింది.
తరచూ సాంకేతిక లోపాలు తలెత్తడం, ఆలస్యమైనా కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం పై విమానయాన సంస్థలపై ప్రయాణికుల అసహనం పెరుగుతోంది. “ఎప్పుడెప్పుడు బయలుదేరుతుందో చెప్పకుండా గంటల తరబడి నిలిపేస్తే ప్రయాణికుల పరిస్థితి ఏమిటి?” అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే డిమాండ్ మరింత బలపడుతోంది.
UP Encounter: యూపీలో ఎన్‌కౌంటర్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ హతం..