ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా తోడుంటేనే విజయం సాధిస్తారు అని అంటుంటారు. భారత మహిళా జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ విషయంలో ఇదే జరిగింది. 21 ఏళ్ల షఫాలీ భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్‌లో బ్యాట్, బంతితో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన ఇచ్చి.. భారత జట్టు 52 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది. ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌కు ముందు కూడా చర్చించబడని షఫాలీ పేరు.. ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఇదే విధి అంటే.
ఓపెనర్ ప్రతికా రావల్ స్థానంలో షెఫాలీ వర్మ ప్రపంచకప్ జట్టులోకి వచ్చింది. సెమీఫైనల్స్ ముందు ప్రతీకా గాయపడింది. ఆ సమయంలో షెఫాలీ దేశీయ టీ20 సిరీస్‌లో ఆడుతోంది. మేనేజ్మెంట్ నుంచి కాల్ రావడంతో.. భారత జట్టులో అడుగుపెట్టారు. సెమీఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై ఆడింది. సెమీఫైనల్స్‌లో షెఫాలీ రాణించలేదు. ఎందుకు తీసుకున్నారు రా బాబు అని అందరూ అనుకున్నారు. కానీ ఫైనల్స్‌లో సత్తాచాటింది. బ్యాట్, బంతితో తన అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్‌లో 78 బంతుల్లో 87 పరుగులు చేసిన షెఫాలీ.. ఆపై బౌలింగ్‌లో 7 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి.
షెఫాలీ వర్మ భారత జట్టులోకి అరంగేట్రం చేసినప్పుడు.. ఆమె దూకుడు బ్యాటింగ్‌ను చూసి వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చారు. మొదటి బంతి నుండే పవర్-హిట్టింగ్ షాట్లు కొట్టగల సామర్థ్యం ఉన్న ఆమె.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించింది. కానీ ఆ దూకుడే మెల్లగా జట్టు నుంచి తొలగించటానికి దారి తీసింది. షెఫాలీ తన జోరును కొనసాగించలేకపోయింది. ఫామ్ కోల్పోయి జట్టులో స్థానం లేకుండా పోయింది. వరుస వైఫల్యాల కారణంగా ఆమెను 2024 ఆస్ట్రేలియా పర్యటన నుంచి తొలగించారు. షఫాలికి ఇది భారీ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె తండ్రికి అంతకు రెండు రోజుల ముందు గుండెపోటు వచ్చింది. ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పకుండా రహస్యంగా ఉంచింది. ఒక వారం తర్వాత మెల్లగా విషయం చెప్పింది.
Also Read: Laura Wolvaardt: మేం అస్సలు ఊహించలేదు.. ఆమె మాకు బిగ్ సర్‌ప్రైజ్!
భారత జట్టు నుంచి తొలగించబడటం, తండ్రి గుండెపోటు లాంటి ఘటనలు షెఫాలీ వర్మని కుంగదీశాయి. కానీ ఆమె తన దైర్యం కోల్పోలేదు. భారత జట్టులోకి తిరిగి రావడానికి చాలా కష్టపడింది. షెఫాలీ తన ఫామ్‌ను తిరిగి పొందడమే కాకుండా.. ఫిట్‌నెస్‌ను కూడా మెరుగుపరుచుకుంది. దేశవాళీల్లో పరుగుల వరద పారించింది. అదే సమయంలో సెమీఫైనల్స్‌కు ముందు ప్రతికా రావల్ గాయపడింది. కీలక మ్యాచులు కాబట్టి మేనేజ్మెంట్ నుంచి షెఫాలీకి కాల్ వచ్చింది. దేశవాళీ ఫామ్ ప్రపంచకప్ ఫైనల్‌లో నిరూపించుకుని సత్తాచాటింది.