ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ఫైనల్ ఓటమిపై దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ స్పందించారు. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తీసుకున్న నిర్ణయమే తమ కొంప ముంచిందని తెలిపారు. షెఫాలీ వర్మ బౌలింగ్ ఇలా ఉంటుందని తాము అస్సలు ఊహించలేదని, మాకు ఆమె బిగ్ సర్‌ప్రైజ్ అని చెప్పారు. ప్రపంచకప్ ఫైనల్‌లో పార్ట్ టైం బౌలర్లకు వికెట్లు ఇవ్వడం సరికాదని వోల్వార్డ్ పేర్కొన్నారు. ఫైనల్లో షెఫాలీ 87 పరుగులు చేసి, రెండు కీలక వికెట్లు పడగొట్టింది. లుజ్, మరిజేన్ కాప్ వికెట్‌లు పడగొట్టింది. ఈ ఇద్దరు వరుస ఓవర్లలో పెవిలియన్ చేరడంతో ప్రొటీస్ టీమ్ ఛేదనలో వెనకపడిపోయింది.
మ్యాచ్ అనంతరం లారా వోల్వార్డ్ మాట్లాడుతూ… ‘టోర్నీలో దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడింది. గర్వపడాల్సిన విషయం ఏంటంటే అందరూ అద్భుతమైన క్రికెట్ ఆడాము. ఈరోజు మేం అద్భుతంగా ఆడాం కానీ.. భారత్ ఇంకా అద్భుతంగా ఆడింది. ఈరోజు ఓడిపోయిన జట్టులో ఉండటం దురదృష్టకరం. ఖచ్చితంగా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం. టోర్నీలో చాల మంది ప్లేయర్స్ సత్తాచాటారు. కొందరికి అద్భుతమైన టోర్నమెంట్ ఇది. ఫైనల్ వరకు వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను. ఈ ప్రపంచకప్‌లో నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేదు. నేను టోర్నమెంట్‌ను బాగా ప్రారంభించలేదు. కెప్టెన్సీ, బ్యాటింగ్ రెండింటినీ వేర్వేరుగా చుస్తాను. నా సహజ ఆట ఆడాను. అదే కెప్టెన్సీపై దృష్టి పెట్టేలా చేసిందని భావిస్తున్నాను’ అని చెప్పారు.
Also Read: India Women’s Cricket: శెభాష్ అమ్మాయిలూ.. మహిళల క్రికెట్ జట్టుకు ప్రధాని అభినందనలు!
‘ముందుగా బౌలింగ్ చేయాలనే నిర్ణయం సరైందే. నేను స్కోరు బోర్డును పరిశీలిస్తూనే ఉన్నాను. భారత బ్యాటర్లు 350 పరుగులు చేయాలని ట్రై చేశారు. మేము పుంజుకుని పరుగుల వేగం ఆపాము. 300 పరుగులు ఈ వికెట్‌పై ఛేజ్ చేయొచ్చని భావించాం. షెఫాలీ వర్మ బౌలింగ్‌తో షాక్ అయ్యాం. బౌలింగ్ ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు. మాకు ఆమె బిగ్ సర్‌ప్రైజ్. ఆమెకు మరిన్ని వికెట్లు ఇవ్వకూడదని పొరపాట్లు చేశాం. షెఫాలీ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఆమె బ్యాటింగ్ విధానం చాలా దూకుడుగా ఉంటుంది. ఈ రోజు మమ్మల్ని ఆమె దెబ్బతీసింది. కాప్ చాలా ఎడిషన్‌లలో అద్భుతంగా ఆడింది. ఇది బహుశా ఆమెకు చివరిది. మేము ఆమె కోసం కప్ గెలవాలని అనుకున్నాం. కానీ అలా జరగలేదు. కాప్ దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ఎంతో చేసింది. ఆమె జట్టులో ఉన్నందుకు మేము చాలా అదృష్టవంతులం’ అని లారా వోల్వార్డ్ తెలిపారు.