జోధ్‌పూర్‌లోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) శ్రీగంగానగర్‌లో రహస్యంగా మాదకద్రవ్యాలను తయారు చేస్తున్న ప్రయోగశాల గుట్టురట్టు చేశారు. అక్కడ ప్రాణాంతకమైన మాదకద్రవ్య పదార్థం మెఫెడ్రోన్ (4-మిథైల్మెత్కాథినోన్) అక్రమంగా తయారు చేస్తున్నారు. సైన్స్ టీచర్లే డ్రగ్స్ తయారు చేయడం చర్చనీయాంశంగా మారింది. స్కూల్ కు సెలవులు పెట్టి మరీ డ్రగ్స్ తయారీలో మునిగిపోయారు.
శ్రీ గంగానగర్‌లోని రిద్ధి సిద్ధి ఎన్‌క్లేవ్‌లోని డ్రీమ్ హోమ్స్ అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌లో ఎన్‌సిబి బృందం దాడి చేసి దాదాపు 780 గ్రాముల ఎమ్‌డిని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌సిబి జోధ్‌పూర్ జోన్ ప్రాంతీయ డైరెక్టర్ ఘనశ్యామ్ సోని తెలిపారు. దీనితో పాటు, అసిటోన్, బెంజీన్, సోడియం బైకార్బోనేట్, బ్రోమిన్, మిథైలమైన్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్, 4-మిథైల్ ప్రొపియోఫెనోన్, ఎన్-మిథైల్-2-పైరోలిడోన్ వంటి అనేక రసాయనాలు, ప్రయోగశాల పరికరాలు కూడా సంఘటనా స్థలంలో గుర్తించారు. వీటిని సింథటిక్ ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.
ఇద్దరు నిందితులను సంఘటనా స్థలం నుంచి అరెస్టు చేశారు. వారిలో ఒకరు ప్రైవేట్ పాఠశాలలో కెమిస్ట్రీ టీచర్, మరొకరు ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ టీచర్. నిందితులిద్దరూ శ్రీ గంగానగర్ నివాసితులు. వారు రెండు నెలల క్రితం ఈ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని అక్రమ డ్రగ్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారని, అవసరమైన రసాయనాలు, పరికరాలను ఢిల్లీ నుంచి ఆర్డర్ చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.