Grama Sabalu : చింతకాని మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు ఈనెల 26 నుండి ప్రారంభం కానున్నాయి. వీటిలో ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు స్థానిక పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామసభకు పంచాయతీ కార్యదర్శి రమేష్ అధ్యక్షత వహించగా, మండల పరిషత్ అధికారి (ఎంపీడీవో) రేబల్లి రామయ్య పథకాలకు సంబంధించిన వివరాలను ప్రజలకు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా పథకం వివరాలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూలీలకు సంబంధించిన వివరాలు, రేషన్ కార్డుల ఎంపిక విధానం, ఇందిరమ్మ ఇళ్ల అర్హుల వివరాలను ఒక్కొక్కటిగా స్పష్టంగా తెలియజేశారు.
ప్రథమంగా గ్రామ రెవెన్యూ వ్యవసాయ అధికారి రైతు భరోసా పథకానికి అర్హులైన రైతుల వివరాలను వివరించారు. రైతు కూలీలకు ఉపాధి హామీ పథకం కింద కనీసం 20 రోజుల పైగా పని చేసిన వారికి అందజేసే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన లబ్ధిదారుల పేర్లు తలారి వేణు ద్వారా చదివి వినిపించబడ్డాయి. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రఘు రేషన్ కార్డుల ఎంపిక విధానం వివరించి, అర్హుల పేర్లను ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల పేర్లను హౌసింగ్ ఏఈ చదివి వినిపించారు.
గ్రామసభలో ప్రకటించిన పథకాల వివరాలు విన్న తర్వాత, గ్రామ ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. పథకాలు కేవలం కొంతమందికి మాత్రమే అందజేసి, చాలా మంది అసలైన అర్హులను పక్కనబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సర్వేను సరైన విధంగా నిర్వహించలేదని, గ్రామంలో చాలా మంది ఇళ్లులేక అవస్థలు పడుతున్నారని ప్రజలు నిలదీశారు. ఎంపీడీవో రేబల్లి రామయ్యతో పాటు పంచాయతీ కార్యదర్శిని చుట్టుముట్టి ప్రశ్నించారు. ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో ఎంపీడీవో రామయ్య మాట్లాడుతూ, ఈసారి పథకాలకు అర్హులుగా ఎంపిక కాకపోయినవారు నిరాశ చెందవద్దని, మరోసారి పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
BJP President: బీజేపీ అధ్యక్షుడుగా అడ్డురి శ్రీరామ్ ఏకగ్రీవం.. స్పందించిన పురందేశ్వరి!
ఈ గ్రామసభలో కాంగ్రెస్ నాయకులు కిలారు మనోహర్ బాబు, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ మజీద్, మాజీ ఎంపీపీ పొనుగోటి రత్నాకర్, దేశబోయిన ఉపేందర్, ఆకుల చంద్రయ్య, మల్లెల వెంకటేశ్వర్లు, గడ్డం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. ప్రజల అంచనాలను నెరవేర్చేందుకు, ఈ పథకాల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడం అత్యవసరం. అధికారులు సర్వేను సమగ్రంగా నిర్వహించి, ప్రతి అర్హుడికి తగిన న్యాయం చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మరియు సంబంధిత శాఖలు వెంటనే చర్యలు తీసుకోవడం అత్యవసరమని భావించవచ్చు.
ఇదిలా ఉంటే.. ఖమ్మం జిల్లా వేం సూరు మండలం కుంచపర్తి .. సత్తుపల్లి మండలంలోని కిష్టారం, సిద్దారం గ్రామాల్లో జరిగిన సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనర్హులను ఇళ్ల లబ్ధిదారులుగా ప్రకటించారు అంటూ ప్రజలు,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మళ్ళీ సర్వే చేసి లబ్ధిదారులను గుర్తించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
సూర్యాపేట మున్సిపాలిటీ1వ వార్డులో జరిగిన గ్రామ సభలో రసా భసా చోటు చేసుకుంది. అర్హులైన.. నిజమైన లబ్ది దారులకు పధకాలు లబ్ది జరగలేదంటూ స్థానికులు ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలంటూ వార్డు ప్రజలు అధికారులను నిలదీశారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చాకలివనిపల్లెలో జరిగిన గ్రామసభలో గందరగోళం చోటు చేసుకుంది. గతంలో వివిధ ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న కొంతమంది లబ్ధిదారుల జాబితాను అధికారులు ప్రకటించారు. సంక్షేమ పథకాల లిస్టులో అర్హత ఉన్నా తమ పేరు తమ పేర్లు రాలేదంటూ గ్రామసభలో స్థానికులు ఆందోళనకు దిగారు. అధికారులు ప్రకటించిన జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
Ravi Abburi: నేను ఇక ఆపేస్తా.. చాలు.. టాలీవుడ్ రచయిత సంచలనం!