Saudi Crown Prince: పాకిస్థాన్‌లో పెట్టుబడులను పెంచే దిశగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ మరో కీలక అడుగు వేశారు. విధ్వంసకర వరదల ప్రభావంతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌కు సాయంతో పాటు పెట్టుబడులను పెంచాలని ఆయన ఆదేశించారు. ఈ నిర్ణయం ఘోరమైన వరదలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మరింత ఉపశమనం కలిగించనుంది.
పాకిస్తాన్ అభివృద్ధి కోసం ఆ దేశ సెంట్రల్ బ్యాంక్‌లో సౌదీ చేస్తోన్న డిపాజిట్‌ను 3 బిలియన్ల డాలర్ల నుంచి 5 బిలియన్లకు పెంచడంపై అధ్యయనం చేస్తుందని సౌదీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సౌదీ ప్రెస్ ఏజెన్సీ మంగళవారం నివేదించింది. అదే నివేదిక ప్రకారం, పాకిస్తాన్‌లో పెట్టుబడులను 10 బిలియన్ డాలర్లకు పెంచే ప్రణాళికను కూడా ఇది అంచనా వేస్తుంది. సౌదీలోని రాజ్య నిధి అభివృద్ధి చెందుతున్న దేశాలకు, మిత్రదేశాలను బలోపేతం చేయడానికి, కొత్త సంబంధాలను సుస్థిరం చేయడానికి రుణాలు, గ్రాంట్‌లను అందిస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడానికి, సహకారాన్ని బలోపేతం చేయడానికి మార్గాలను సమీక్షించడానికి క్రౌన్ ప్రిన్స్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్‌తో సమావేశమైన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వచ్చింది.
పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిండుకుంటున్న విదేశీ మారక నిల్వలు పాకిస్థాన్‌ను ఆహార సంక్షోభం అంచున నిలబెట్టాయి. 2022లో వచ్చిన వరదలతో అప్పటికే బలహీనంగా ఉన్న పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ద్రవ్యోల్బణం పైపైకి వెళ్లిపోవడంతో ప్రస్తుతం నిత్యావసరాలు కొనుగోలు చేయడమే గగనంగా మారింది. సంక్షోభం నుంచి బయటపడేందుకు పాకిస్థాన్ స్నేహపూర్వక దేశాలపైనే ఆధారపడుతోంది. ఈ వారం ప్రారంభంలో, పాకిస్తాన్ 10 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ సహాయాన్ని అందుకుంది. పాక్ విదేశీ మారక నిల్వలు 5.6 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇది దాదాపు తొమ్మిదేళ్లలో కనిష్ట స్థాయి కాగా.. ఒక నెల కంటే తక్కువ దిగుమతులను కవర్ చేయడానికి సరిపోతుంది. ఆర్థిక వ్యవస్థ క్షీణించడంతో పాకిస్తాన్ విద్యుత్, విదేశీ మారక నిల్వలను ఆదా చేయడానికి అధికారులు పొదుపు చర్యలను ప్రకటించవలసి వచ్చింది.
Longest River Cruise: గంగానదిలో ప్రపంచంలోనే అతిపొడవైన రివర్ క్రూయిజ్.. ప్రారంభించనున్న ప్రధాని
సౌదీ అరేబియా గత నెలలో పాకిస్తాన్‌కు 4 శాతం వడ్డీ చొప్పున మరో 3 బిలియన్ డాలర్ల రుణాన్ని ఒక సంవత్సరం పాటు అందించింది. సౌదీ ప్రభుత్వం చేయగలిగినంత సాయాన్ని పాకిస్తాన్‌కు అందిస్తామని సౌదీ ఆర్థిక మంత్రి మహ్మద్ అల్ జదాన్ గత నెలలో విలేకరుల సమావేశంలో చెప్పారు. మార్చిలో చైనా నుంచి 2.1 బిలియన్ డాలర్లను పొడిగించాలని పాకిస్తాన్ కూడా కోరుతోంది. పాకిస్తాన్ విదేశీ రుణంలో దాదాపు 30శాతం ప్రభుత్వ యాజమాన్యంలోని వాణిజ్య బ్యాంకులతో సహా చైనాకు చెల్లించాల్సి ఉంది.