Satya Kumar Yadav: రాష్ట్రంలో నేటి నుండి ప్రారంభమైన సుపరిపాలన యాత్రలో శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. వాజపేయి పాలన భారత ఆర్థిక ప్రగతికి బలమైన పునాది వేసిందని, ఆయన చూపిన దిశలోనే నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయని ఈ సందర్బంగా ఆయన అన్నారు. వాజపేయి నాయకత్వం దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపినదే కాకుండా, జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులు, ఐటీ, టెలికాం కనెక్టివిటీ వంటి కీలక రంగాలలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. 23 పార్టీలతో కూటమి ప్రభుత్వాన్ని నడిపినా, అజాత శత్రువుగా పేరు పొందిన వాజపేయి ప్రజలకు సుపరిపాలన అందించారని అన్నారు.
గ్రామీణ భారత అభివృద్ధిలో వాజపేయి పాత్ర అపారమని, గ్రామీణ సడక్ యోజన ద్వారా ఎనిమిది లక్షల కిలోమీటర్ల రహదారుల నిర్మాణం ఆయన దూరదృష్టికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం రూపకల్పనకు కూడా ఆయననే ప్రేరణ అని గుర్తించారు. అలాగే గతంలో గ్రామాల్లో రోడ్లు, రవాణా సదుపాయాలు లేనప్పుడు ట్రాక్టర్లతోనే ఊర్లు దాటే పరిస్థితులు ఉండేవని, కానీ వాజపేయి సమయంలో గ్రామాల అభివృద్ధి కొత్త దశలోకి ప్రవేశించిందని అన్నారు. ఇప్పుడు అధికారులు పల్లెపల్లెకు వెళ్లి సేవలు అందించగలుగుతున్న పరిస్థితి కూడా ఆ పాలన వేసిన బాటలో భాగమే అని చెప్పారు.
నేడు ప్రారంభమైన సుపరిపాలన యాత్ర డిసెంబర్ 25 వరకు కొనసాగుతుందని మంత్రి తెలిపారు. బాపట్లలో జరిగే సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారని, మరో ప్రాంతంలో జరిగే సభలో నారా లోకేష్ హాజరవుతారని తెలిపారు. డిసెంబర్ 25న అమరావతిలో జరిగే ముగింపు సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారని చెప్పారు. వాజపేయి, చంద్రబాబు భాగస్వామ్యంతో అనేక అభివృద్ధి పనులు జరిగినట్లు గుర్తుచేస్తూ.. నేడు మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు.
AI ఇమేజింగ్, 7100mAh బ్యాటరీ, HDR+ డిస్‌ప్లేతో గేమ్ ఛేంజర్ HONOR Magic8 Pro లాంచ్..
వాజపేయి ప్రారంభించిన 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారి ప్రాజెక్టులను, నేడు మోడీ 1.20 లక్షల కిలోమీటర్ల హైవే ప్రాజెక్టులతో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. నదుల అనుసంధానం ద్వారా దేశవ్యాప్తంగా సాగు నీరు అందేలా చేసిన దృష్టిలో కూడా వాజపేయి, మోడీ పాలనల సామాన్యత ఉందని వివరించారు. ఇక రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ద్వారా ఏపీ రైతులకు సాగు నీరు అందడం ఇదే అభివృద్ధి మార్గదర్శకానికి ఉదాహరణ అని మంత్రి అన్నారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే అనేక పథకాలు కేంద్రం తీసుకువస్తోందని చెప్పారు.
వాజపేయి హయాంలో గ్రామీణాభివృద్ధి శాఖలో అడిషనల్ పీయస్‌గా పనిచేశానని.. అప్పటి అనుభవం నా ప్రజా సేవ పట్ల మరింత నిబద్ధతను పెంచిందని మంత్రి తెలిపారు. ధర్మవరం ప్రజల కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఈ సందర్బంగా వాజపేయి చూపిన అభివృద్ధి, సుపరిపాలనా మార్గం ఇంకా దేశానికి ప్రేరణగా నిలుస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.