రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సంక్రాంతి పండుగ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది కోడి పందేలు. ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలలో పందేలు కాయడానికి ఎంతోమంది సిద్ధంగా ఉంటారు. అయితే పందేల సమయంలో చాలా కోళ్లు అపహరణకు గురవుతాయి. తాజాగా ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లా తేలప్రోలులో చోటుచేసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 15 కోళ్లను దొంగలు ఎత్తుకెళ్లారు.
కృష్ణా జిల్లా తేలప్రోలులో ఆదివారం తెల్లవారుజామున కోడిపుంజుల చోరీ జరిగింది. తేలప్రోలులోని చిన్న బజారుకు చెందిన మణికంఠ రెడ్డి స్థలంలో సుమారుగా రూ.5 లక్షల విలువ చేసే పదిహేను కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. దుండగులు సీసీ కెమెరాలపై దుస్తుల కప్పి కోళ్లను తీసుకువెళ్లారు. బాధితుడు మణికంఠ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని.. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఇందులో కొన్ని కోళ్లు కోడి పందేల కోసం పెంచారట. ఇది తెలిసిన వారి పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోవైపు కృష్ణా జిల్లా కంకిపాడులో ఎడ్ల పందేలను వైభవంగా నిర్వహిస్తున్నారు. జనసేన జెండాలతో ఎడ్ల బండ్లను సిద్ధం చేశారు. ఒకొక్క బండికి ఆరు నిముషాల సమయం ఇస్తూ ఎడ్ల పందాలు నిర్వహించారు. ఈ పందేలను చూడటానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి జనాలు వచ్చారు. మహిళలు సైతం ఈ పోటీలలో పాల్గొనడం విశేషం. రైతుకు ఎంతో ఉపయోగపడే ఎడ్లను సంతోషపరచడానికి, వాటిపైన ప్రేమతోనే ఈ పందేలు నిర్వహిస్తున్నాం అని నిర్వాహకులు అంటున్నారు.