Sanjay Raut: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. తనకు మొబైల్ టెక్ట్స్ సందేశాల ద్వారా చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని ఆయన తెలిపారు. శుక్రవారం రాత్రి బెదిరింపుల గురించి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం పంజాబ్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తరపున ఈ మెసేజ్‌లు ఉన్నాయి. దీనిపై పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Also: Hinduphobia: హిందూ వ్యతిరేక మతోన్మాదాన్ని ఖండిస్తూ అమెరికా తీర్మానం
“నా ఫోన్‌లో నాకు బెదిరింపు వచ్చింది, దాని గురించి నేను పోలీసులకు సమాచారం ఇచ్చాను. కానీ ఈ ప్రభుత్వం సీరియస్‌గా లేదు. గతంలో కూడా నన్ను బెదిరించారు, కానీ రాష్ట్ర హోం మంత్రి దీనిని స్టంట్ అని పిలిచారు,” అని సంజయ్ రౌత్ అన్నారు. ప్రతిపక్ష నేతల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా లేదని ఆయన మండిపడ్డారు. సంజయ్ రౌత్ ఇంకా మాట్లాడుతూ.. ఇది తనను ఇబ్బంది పెట్టదని, తన భద్రతను ఉపసంహరించుకున్నప్పుడు కూడా తనకు ఎలాంటి లేఖ రాయలేదని అన్నారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యకు కరడుగట్టిన నేరస్థుడు లారెన్స్ బిష్ణోయ్ ప్రధాన సూత్రధారి. అతను గాయకుడి తండ్రి బాల్కౌర్ సింగ్, నటుడు సల్మాన్ ఖాన్‌ను కూడా బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి.