సూపర్ ఫామ్‌లో ఉన్న రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ రెండో టెస్ట్‌లో కూడా రాణిస్తారని టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. పంత్ పరుగుల దాహంతో ఉన్నాడని, అతడు కచ్చితంగా మరిన్ని రన్స్ సాధిస్తాడన్నాడు. రాహుల్ ఒక్క శతకంతోనే ఆగిపోడని, మరిన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడతాడని మంజ్రేకర్ తెలిపాడు. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎడ్జ్‌బాస్టన్‌లో జులై 2 నుంచి రెండో టెస్ట్ ఆరంభం కానుంది.
Also Read: Yashasvi Jaiswal: అరుదైన మైలురాయికి అడుగు దూరంలో యశస్వి!
స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన ‘గేమ్ ప్లాన్’ షోలో సంజయ్ మంజ్రేకర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ‘రిషభ్ పంత్ రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ తన ఫామ్‌ను కొనసాగిస్తాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతను టెస్ట్ క్రికెట్‌లో బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తున్నాడు. ఒక టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేయం మామూలు విషయం కాదు. పంత్ పరుగుల దాహంతో ఉన్నాడు. అతడు కచ్చితంగా మరిన్ని పరుగులు చేస్తాడు. సీనియర్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ మొదటి టెస్ట్‌లో శతకం చేశాడు. ఈ ఒక్క సెంచరీతో అతడు ఆగిపోడు. మరిన్ని అద్భుత ఇన్నింగ్స్‌లు రాహుల్ ఆడతాడు. భారత క్రికెట్‌కు అతని అవసరం చాలా ఉంది’ అని మంజ్రేకర్ చెప్పాడు.