పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తన మనసులో మాటను బయటపెట్టారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యాడు. ఇదిలా ఉంటే.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన హమీలను ప్రజలు నమ్మలేదని సంపత్ పేర్కొన్నారు. దళితులని మోసం చేసేందుకు ఎస్సీ వర్గీకరణ మీద బీజేపి కమిటీ వేసిందని దుయ్యబట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే శాసన సభలో ఎస్సీలని ఏబీసీడీలుగా వర్గీకరణ చేయలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని సంపత్ తెలిపారు. రాజ్యంగ సవరణ ద్వారా రాష్ట్రాలకి ఎస్సీలని ఏబీసీడీ వర్గీకరణ చేసే అధికారం ఇవ్వచ్చన్నారు.
దళితులని 10 సంవత్సరాలు పచ్చిగా మోసం చేశారని బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఉషా మెహ్ర రిపొర్ట్ ప్రకారం.. 10 రోజుల్లో కూడా ఎస్సీ వర్గీకరణ చేయవచ్చు అన్నారు. పది సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి.. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కమిటీ పేరుతో పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. దళితులకి న్యాయం జరగాలని కాంగ్రెస్ చిత్త శుద్దితో పని చేసిందని అన్నారు. కమిటీ పేరుతో కాలయాపన చేస్తే దళితులే చూస్తు ఊరుకోరని ఆయన తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చెయ్యమని 10 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ చెపుతూనే ఉన్నారన్నారు. కాగా.. తెలంగాణలో దళితులు ఓటేయబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు.