30వ విడత ఎలక్టోరల్ బాండ్ల అమ్మకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇవాళ్టి నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల విషయంలో పారదర్శకత తీసుకు వచ్చేందుకు ఈ బాండ్లను ప్రవేశ పెట్టింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మళ్లీ ఈ బాండ్ల సందడి స్టార్ట్ అయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన 29 అధీకృత శాఖల ద్వారా నేటి నుంచి జనవరి 11వ తేదీ వరకు ఎలక్టోరల్ బాండ్లను విక్రయించనుందని ఆర్థిక శాఖ తెలిపింది.
Read Also: Redmi Note 13 5G Series : మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్.. ధర, ఫీచర్స్ ఏంటంటే?
రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలలో పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశ పెట్టారు. ఎలక్టోరల్ బాండ్ల మొదటి విడత మార్చి 2018లో విక్రయించబడింది. ఎలక్టోరల్ బాండ్‌లను అర్హత కలిగిన రాజకీయ పార్టీ అధీకృత బ్యాంకులో ఉన్న తన బ్యాంక్ ఖాతా ద్వారా మాత్రమే క్యాష్ చేసుకుంటుంది. బెంగళూరు, లక్నో, సిమ్లా, డెహ్రాడూన్, కోల్‌కతా, గౌహతి, చెన్నై, పాట్నా, న్యూఢిల్లీ, చండీగఢ్, శ్రీనగర్, గాంధీనగర్, భోపాల్, రాయ్‌పూర్ తో పాటు ముంబైలోని ఎస్బీఐ అధీకృత శాఖల్లో మాత్రమే ఈ బాండ్ల విక్రయం కొనసాగుతుంది.
Read Also: Durga Stotram: మార్గశిర మంగళవారం నాడు ఈ స్తోత్రం వింటే మీకు ఇక తిరుగుండదు
ఇక, ఎలక్టోరల్ బాండ్లు జారీ చేసిన తేదీ నుంచి 15 రోజుల పాటు చెల్లుబాటు అవుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. చెల్లుబాటు వ్యవధి ముగిసిన తర్వాత బాండ్ డిపాజిట్ చేయబడితే, రాజకీయ పార్టీకి చెల్లింపు చేయబడదు అని పేర్కొనింది. గత లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక శాతం ఓట్లను సాధించిన రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు పొందేందుకు అర్హులని మంత్రిత్వ శాఖ చెప్పింది. ఎలక్టోరల్ బాండ్లను భారతీయ పౌరులు లేదా దేశంలో స్థాపించబడిన సంస్థలు కొనుగోలు చేయవచ్చు అని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.