Sajjala RamaKrishna Reddy: టీటీడీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. షెల్ కంపెనీ ద్వారా చెందిన కిక్ బాక్స్ ఎలా తీసుకున్నారో ఇంగ్లీష్ పత్రికలు వార్తలు రాశాయన్న ఆయన.. హిందుస్థాన్ టైమ్స్, డెక్కన్ క్రానికల్ లో కథనాలు వచ్చాయి.. ఐటీ ఇచ్చిన నోటీసులను కూడా ముద్రించారు.. కానీ, దీనిపై చంద్రబాబు ఎందుకు స్పందించటం లేదు? అని నిలదీశారు. మనోజ్ వాసుదేవ్ పార్థసాని అనే వ్యక్తిని విచారించే క్రమంలో అతను స్టేట్‌మెంట్ ఇచ్చాడు.. నేరుగా చంద్రబాబుకు 118 కోట్ల రూపాయలు ముడుపులు అందాయి అని ఆరోపించారు. ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ కంపెలకు కాంట్రాక్టు ఇచ్చారు.. ఈ రెండు కంపెనీల ద్వారా కొన్ని షెల్ కంపెనీలకు మళ్లినట్లు ఆధారాలతో సహా నోటీసులో పేర్కొన్నారని తెలిపారు.. ఈ విషయాలు బయటకు వచ్చి 48 గంటలు అయినా చంద్రబాబు, ఆ పార్టీ నేతలు స్పందించ లేదన్న ఆయన.. ఈ కేసులో జోన్ షిఫ్ట్ అనే సాంకేతిక అంశాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఆలస్యం చేస్తూ వస్తున్నారని విమర్శించారు.
అసలు ఆరోపణలపై స్పందించకుండా వ్యవస్థల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు సజ్జల.. స్టే తెచ్చుకుని కాలం గడిపేసే అలవాటు చంద్రబాబుదన్న ఆయన.. మాకు దొరికిన ఆధారాల ప్రకారం లెక్కలో లేని ఆదాయం బోగస్ కంపెనీల నుంచి మళ్లీ మీకే చేరాయి అని చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులో స్పష్టంగా ఉందన్నారు. నారా లోకేష్ సన్నిహితుడు కె.రాజేష్ పాత్ర గురించి ఐటీ శాఖ నోటీసులో ఉందన్నారు సజ్జల. ఇక, అమరావతి ఒక స్కామ్.. ఈ పేరుతో తాను, తన అనుచరులు కొన్ని తరాల పాటు దర్జాగా బతికే కుట్ర చేశారన్నారు. టిడ్కో హౌసింగ్ కూడా మరో స్కామ్‌గా అభివర్ణించిన ఆయన.. వెయ్యి రూపాయలు అయ్యే ఎస్ఎఫ్‌టీ ఖర్చును రెండు వేల రూపాయలకు చూపించారు.. 25 ఏళ్ల పాటు పేద ప్రజలు అప్పుల భారం మోసేలా చంద్రబాబు ప్రయత్నం చేశారని ఆరోపించారు.
మనోజ్ వాసుదేవ్ పార్థసాని తాను చంద్రబాబును తరచూ కలిసినట్లు ఐటీ శాఖ దగ్గర వెల్లడించాడని పేర్కొన్నారు సజ్జల.. చంద్రబాబు బరితెగించి అవినీతికి పాల్పడ్డాడని మండిపడ్డ ఆయన.. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని తేలినా ఈడీ ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. రెండేళ్ల నుంచి నోటీసుల దశలోనే కేసు తిరుగుతోంది.. కేంద్ర నిఘా సంస్థలు అన్నీ ఈ అంశం పై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ ఆధారాలతో కోణంలో మరింత లోతుగా విచారణ చేస్తామని.. కేంద్ర ఏజెన్సీలను కూడా అడుగుతాం అని ప్రకటించారు సజ్జల రామకృష్ణారెడ్డి. మరోవైపు.. ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ విధివిధానాలపై స్పష్టత రావాల్సి ఉందన్నారు సజ్జల.. ఆలోచన మంచిదే… అమలుపై చాలా ప్రశ్నలు ఉన్నాయన్న ఆయన.. చర్చలు, సంప్రదింపులు కీలకం .. జమిలి ఎన్నికలు జిందా తిలస్మత్ కాదు.. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి.. అర్జంట్‌గా చర్చించాల్సిన స్థాయి అంశం కాదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.