Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్‌పై దాడి దారుణమని.. దాడిని వైఎస్‌ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. . సీఎం జగన్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డారని.. ఇది పిరికిపందల చర్య అంటూ మండిపడ్డారు. దాడికి ఎయిర్‌గన్ ఉపయోగించి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఆకతాయిలు చేసిన పని కాదు.. పక్కా ప్లాన్‌తో చేశారన్నారు. భద్రతా వైఫల్యం అంటూ మాట్లాడుతున్నారు.. దాడిని నటన అంటున్నారు.. ఎవరైనా తమపై తామే ఇలాంటి దాడి చేయించుకుంటారా అంటూ సజ్జల ప్రశ్నించారు. కడుపునకు అన్నం తినేవారు ఎవరైనా ఇలా మాట్లాడరని సజ్జల మండిపడ్డారు. అసలు నటించేది ఎవరో అందరికీ తెలుసన్నారు. కొంచెం పక్కకు తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం జరిగేదని.. కొంచెం కిందకు తగిలిఉంటే కన్ను పోయేదని ఆయన చెప్పారు. ఈ ఘటనలో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తీవ్రంగా గాయపడ్డారన్నారు.
Read Also: Kodali Nani: సీఎం జగన్‌పై దాడి.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
ఇది సాధారణంగా జరిగిన ఘటన కాదని.. ఇది కోల్డ్ బ్లడెడ్ పక్కా ప్లాన్ మర్డర్ అటెంప్ట్ అని ఆయన అనుమానించారు. ప్రతీ చోట చంద్రబాబు రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారన్న సజ్జల.. ఓటమి ఖాయమైపోవడంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. . దేవుడు, ప్రజలు ఆశీస్సులతో జగన్ క్షేమంగా ఉన్నారన్నారు. వైద్యుల సలహా మేరకు ఇవాళ విరామం తీసుకున్నారని.. నటన చంద్రబాబుకు అలవాటు. నటించాల్సిన అవసరం జగన్‌కు లేదన్నారు. జగన్‌పై దాడిని ఎగతాళి చేస్తున్నారు…అసలు మీరు మనుషులేనా అంటూ మండిపడ్డారు. జగన్ యాత్ర వల్ల నష్ట పోయె వాళ్ళదే ఈ చర్యగా అనిపిస్తుందన్నారు. జగన్ పై దాడి తీవ్రమైన హత్య ప్రయత్నంగా చూస్తున్నామన్నారు.
సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ..” అదృష్టం, దేవుడి ఆశీస్సులతో జగన్ క్షేమంగా ఉన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఈ హత్యాప్రయత్నం జరిగింది. జగన్ బస్సు యాత్ర రేపటి నుంచి కొనసాగుతుంది. మాకు నాటకాలు చేసి ప్రజల సానుభూతి తెచ్చుకోవాలన్న ఆలోచన లేదు. అలిపిరి ఘటనతో చంద్ర బాబు సానుభూతి కోసం ప్రయత్నాలు చేసి …విఫలం అయ్యారు. చంద్ర బాబు స్కూల్‌లో ఉన్న వారికి నెగిటివ్ లక్షణాలు ఉంటాయి. జరిగిన ఘటనకు బాధ్యత టీడీపీదే.” అని సజ్జల పేర్కొన్నారు.