Sabarimala: శబరిమల మండల-మకరవిళక్కు సీజన్ మొదలైంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. ప్రధాన అర్చకుల సమక్షంలో శాస్త్రోక్తంగా పూజలు ప్రారంభమవుతాయి. శ్రీకోవిల్ నుంచి తీసుకువచ్చిన పవిత్ర జ్వాలతో 18 మెట్లు వద్ద అధి వెలిగించడం, రాత్రి అభిషేకం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. అయితే భక్తుల దర్శనానికి సోమవారం తెల్లవారుజామున 3 గంటల తర్వాత అనుమతి ఇస్తారు. వృశ్చిక మాసం ఆరంభం కావడంతో అప్పుడే అధికారికంగా తీర్థయాత్ర సీజన్ ప్రారంభమవుతుంది. అయితే.. ఈసారి అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా కూడా జాగ్రత్తలు అవసరమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.
రాష్ట్రంలో ఇటీవల మెదడు వాపు వంటి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా నది స్నానాల సమయంలో ముక్కులోకి నీరు పోకుండా జాగ్రత్తపడాలని సూచించింది. ఎందుకంటే కేరళలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే ప్రమాదకర వ్యాధి కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 69 కేసులు నమోదవగా, 19 మంది మరణించినట్లు సమాచారం. ఈ వ్యాధి నీటిలో ఉండే హానికర పరాన్నజీవుల వల్ల వస్తుందనే కారణంగా భక్తులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. అలానే యాత్రికులు ఆరోగ్య రికార్డులు, అవసరమైన మందులు వెంట తీసుకురావాలని చెప్పారు. కొండ మార్గంలో నెమ్మదిగా నడవడం, మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం, అలసట లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించడం వంటి సూచనలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో 04735 203232 నంబర్‌కు కాల్ చేయవచ్చని అధికారులు తెలిపారు.
READ MORE: Bird Flu Virus: వ్యక్తికి సోకిన బర్డ్ ఫ్లూ.. కరోనాలా మరో “మహమ్మారి” కానుందా.?
పానీయాల విషయంలో కూడా ప్రత్యేక సూచనలు చేశారు. మరిగించిన నీటినే తాగాలి. బయట ఉంచిన ఆహారం లేదా సరిగ్గా శుభ్రం చేయని పండ్లను తినకూడదు. బహిరంగ మలవిసర్జన పూర్తిగా నిషేధించారు. టాయిలెట్లు, చెత్తబుట్టలు మాత్రమే వినియోగించాలని భక్తులకు ఆదేశాలు జారీ చేశారు. పాముకాటు ప్రమాదాలకు సంబంధించి కూడా ముందస్తు ఏర్పాట్లు చేశారు. యాత్ర మార్గాల్లో శిక్షణ పొందిన స్వచ్ఛంద ఆరోగ్య సిబ్బందిని మోహరించడంతో పాటు పంపాలో 24 గంటలు పనిచేసే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అవసరమైన అన్ని రకాల మందులు, యాంటీ వీనం ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉంచినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దేశం నలుమూలల నుంచి భక్తులు శబరిమల ఆధ్యాత్మిక ప్రయాణం సురక్షితంగా సాగేందుకు ప్రభుత్వ అధికారులు అన్ని రంగాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు.