భారత టీ20 జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో నేడు మూడో టీ20లో తలపడనుంది. దక్షిణాఫ్రికా పర్యటనను ఘన విజయంతో ఆరంభించిన భారత్.. రెండో మ్యాచ్‌లో తడబడింది. దాంతో మూడో టీ20 కీలకంగా మారింది. ఈ టీ20లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని సూర్య సేన చూస్తోంది. బుధవారం రాత్రి 8.30 గంటల నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
సంజూ శాంసన్ తొలి మ్యాచ్‌లో సెంచరీ చేయగా.. రెండో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. మూడో టీ20లో అతడు భారీ ఇన్నింగ్స్ ఆడాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అభిషేక్ శర్మ వరుస వైఫల్యాలు జట్టుకు ప్రతికూలంగా మారింది. రెండు మ్యాచులలో సింగిల్ డిజిట్‌లకే (7, 4) పరిమితమయ్యాడు. సెంచూరియన్‌లో అయినా బ్యాట్ ఝళిపిస్తాడేమో చూడాలి. నేడు కూడా ఆదుకుంటే.. అభిషేక్ పనయిపోయినట్లే. సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ నుంచి అలరించే ఇన్నింగ్స్ ఇంకా రాలేదు. తిలక్, హార్దిక్ పర్వాలేదనిపించారు.
స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రవి బిష్ణోయ్ సత్తా చాటుతున్నాడు. మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ తేలిపోయాడు. అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ పేలవంగా బౌలింగ్ చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. దాంతో కొత్త ఆటగాళ్లు రమణ్‌దీప్ సింగ్, యశ్ దయాళ్, వైశాఖ్ విజయ్‌కుమార్‌లలో ఒకరిద్దరికి మూడో టీ20 ఛాన్స్ ఇచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం. అక్షర్ స్థానంలో రమణ్, అవేష్ బదులు యశ్, వైశాఖ్‌ల్లో ఒకరిని ఆడించొచ్చు.
మరో విజయం సాధించాలని దక్షిణాఫ్రికా చూస్తోంది. మార్‌క్రమ్, క్లాసెన్ లాంటి స్టార్ బ్యాటర్లు బ్యాట్లు ఝళిపించలేకపోతున్నారు. టాప్‌ఆర్డర్ తేలిపోతోంది. గత మ్యాచ్‌లో స్టబ్స్ పుణ్యమా అని గెలిచింది. అయితే సఫారీ బౌలింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. యాన్సెన్, కొయెట్జీ, పీటర్ జోరుమీదున్నారు. ఇక సెంచూరియన్ పిచ్ పేసర్లకు సహకరిస్తుంది. ఈ వికెట్‌పై బంతి బాగా బౌన్స్ అవుతుంది. అయితే పిచ్ బ్యాటింగ్‌కూ అనుకూలంగానే ఉంటుంది. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది.
తుది జట్లు (అంచనా):
భారత్: శాంసన్, అభిషేక్, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్, హార్దిక్, రింకూ, అక్షర్/రమణ్‌దీప్, అర్ష్‌దీప్, వరుణ్, బిష్ణోయ్, అవేశ్/యశ్.
దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్ (కెప్టెన్), రికెల్టన్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, క్రుగర్, జాన్సెన్, సిమెలానె, కొయెట్జి, కేశవ్, పీటర్.