Russia Attack: ఉక్రెయిన్‌పై రష్యా మళ్లీ విరుచుకుపడింది. దాదాపు 81 క్షిపణులతో తాజాగా దాడి చేసింది. చాలా గ్యాప్ తర్వాత ఉక్రెయిన్‌పై రష్యా పెను దాడి చేసింది. దీంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరైంది. రాత్రికి రాత్రే ఆ మిస్సైళ్లను వదిలినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ రక్షణ శాఖ ధ్రువీకరించింది. రష్యా ప్రయోగించిన 34 క్షిపణులను, షాహిద్ డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. తాజాగా మిస్సైల్ అటాక్‌లో 9 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. జపొరిజియా న్యూక్లియర్ ప్లాంట్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈ అణు విద్యుత్ కేంద్రం వద్ద దాడి జరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అణుకేంద్రం నిర్వహిస్తున్న ఎనర్గోఆటమ్ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. మాస్కో ఆధీనంలోని జపోరిజియా నగరంలోని రష్యా అధికారులు మాట్లాడుతూ ఈ అణువిద్యుత్తు కేంద్రానికి ఉక్రెయిన్ విద్యుత్తు సరఫరా నిలిపివేయడం కవ్వింపు చర్యే అని వెల్లడించారు.
Read Also: Nepal President: నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని పశ్చిమ, దక్షిణ భాగాలపై రష్యా భారీ దాడులు నిర్వబించింది. కీవ్ నగరంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు షెల్టర్లలోనే జాగ్రత్తగా ఉండాలని అధికారులు అభ్యర్థించారు. రేవు నగరమైన ఒడెస్సాలో కూడా క్షిపణి దాడులు జరగగా.. విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగింది. ఖార్కీవ్ నగరంపై 15 క్షిపణులను ప్రయోగించగా.. భవనాలు దెబ్బతిన్నాయి. జనవరి తర్వాత ఉక్రెయిన్‌పై జరిగిన అతిపెద్ద దాడిగా ఆ దేశం ప్రకటించింది.