Vishwakarma Scheme: నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA).. కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన “పీఎం విశ్వకర్మ”కు ఆమోదం తెలిపింది. మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి ప్రకటించిన ఈ పథకం ద్వారా 30 లక్షల మంది హస్తకళాకారులు, వారి కుటుంబాలకు రాయితీపై వడ్డీ రేటుతో పూచీకత్తు రహిత రుణాలను అందించడం ద్వారా ప్రయోజనం అందిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.2028 వరకు ఐదు సంవత్సరాల కాలానికి రూ.13,000 కోట్ల ఆర్థిక వ్యయంతో కూడిన ఈ పథకం, మొదటి సందర్భంలో 18 సంప్రదాయ వ్యాపారాలను కవర్ చేస్తుంది. పథకంలో భాగంగా రూ.1 లక్ష వరకు రుణ సదుపాయాన్ని కల్పించనున్నారు. దీనిపై గరిష్టంగా 5 శాతం వడ్డీని విధించనున్నారు. విశ్వకర్మ యోజన పథకానికి రూ.13 వేల కోట్ల నిధులను వెచ్చించనున్నారు. ఈ పథకం వల్ల దేశంలో 30 లక్షల మంది చేతివృత్తుల కళాకారులకు లబ్ధి చేకూరనుంది. “పీఎం విశ్వకర్మ” పథకం కింద మొదటి దశలో కవర్ చేయబడిన వారిలో వడ్రంగులు, పడవలు తయారు చేసేవారు, కమ్మరి, తాళాలు చేసేవారు, స్వర్ణకారులు, కుమ్మరులు, శిల్పులు, చెప్పులు కుట్టేవారు, తాపీ పని చేసేవారు ఉన్నారు.
Also Read: New Rules: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్రం కొత్త రూల్స్..!
చేతివృత్తులు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారి కోసం ఈ పథకం కింద రెండు శిక్షణ కార్యక్రమాలను తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న వారికి రోజుకు రూ.500 ఉపకార వేతనంతో మెరుగైన శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. శిక్షణ తర్వాత పరికరాల కొనుగోలు కోసం రూ.15వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత వడ్డీపై రాయితీతో తొలుత రూ.లక్ష రుణం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తొలి విడత సద్వినియోగం చేసుకుంటే రెండో విడత కింద రూ.2లక్ష రుణం మంజూరు చేయనున్నట్లు తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబరు 17 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
Read Also: Kota: కోటాలో రాలిపోతున్న విద్యార్థులు.. మరో విద్యార్థి ఆత్మహత్య
ఈ సమావేశంలో ‘‘పీఎం ఈ బస్ సేవ’’కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.57 వేల కోట్ల మొబిలిటీ ఫండ్ కేటాయించారు. 169 నగరాలు, పట్టణాలకు 10 వేల ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని నివారించడంతో పాటు రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. డిజిటల్ ఇండియా పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం రూ.14,903 కోట్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద 2.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులకు నైపుణ్యాలను మెరుగుపర్చనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు దేశంలో రైల్వే లైన్ల విస్తరణ, రైళ్ల రాకపోకలను క్రమబద్ధీకరించడం, రద్దీని తగ్గించడం కోసం ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.32,500కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించనుంది.