RR vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్ (RR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య పోరులో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా.. రాజస్థాన్ రాయల్స్ మొదటి బ్యాటింగ్ చేసింది. ఇక నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగుల స్కోర్ చేసింది. ఈ ఇన్నింగ్స్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించి 47 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 75 పరుగులు చేశాడు. దీనితో రాజస్థాన్‌కు మంచి ప్రారంభం అందించాడు. అయితే, జైస్వాల్ 15వ ఓవర్లో జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో 75 పరుగుల వద్ద వెనుతిరిగాడు.
ఆ తర్వాత కెప్టెన్ సంజు సాంసన్ 15 పరుగులు చేసి కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో స్టంప్ అయ్యాడు. రియాన్ పరాగ్ 22 బంతుల్లో 30 పరుగులు చేసి విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చాడు. శిమ్రాన్ హెట్‌మేయర్ 9 పరుగులు చేసి చివర్లో అవుట్ కాగా, ధ్రువ్ జురేల్ 23 బంతుల్లో 35 నాటౌట్, నితీష్ రాణా 4 నాటౌట్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఇక బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్యా, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ ఒక్కో వికెట్ తీసారు. కృనాల్ పాండ్యా 4 ఓవర్లలో 29 పరుగులే ఇచ్చి పర్వాలేదనిపించాడు. ఇక మొత్తంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టార్గెట్ గా 174 పరుగులు చేయాల్సి ఉంది.