Rohit Sharma to give 5 Crore prize money to Support Staff: టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల బహుమతిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మొత్తంలో 15 మంది ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు రూ.5 కోట్లు దక్కనున్నాయి. బీసీసీఐ ఇచ్చిన బోనస్‌పై ద్రవిడ్ ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నారు. తన బోనస్‌ను సగానికి తగ్గించాలని బీసీసీఐని కోరారు. మిగతా కోచ్‌లకు ఇచ్చిన విధంగానే రూ.2.5 కోట్లు తనకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ద్రవిడ్ కంటే ముందే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన బోనస్‌ను వదులుకునేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.
సహాయక సిబ్బందిలో తక్కువ బోనస్ అందుకున్న వారి కోసం రోహిత్ శర్మ తన బోనస్‌ను (రూ.5 కోట్లు) వదులుకునేందుకు సిద్ధపడినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. జట్టు కోసం శ్రమించిన సహాయక సిబ్బందిలో ప్రతి ఒక్కరికీ సమానంగా డబ్బు అందాలనే ఉద్దేశంతోనే రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. బార్బడోస్ నుంచి భారత్ వచ్చే సమయంలో రోహిత్ తన అభిప్రాయాన్ని తెలిపాడట. ‘టీమిండియా గెలుపు కోసం త్రోడౌన్ స్పెషలిస్ట్‌లు, మసాజర్స్, ఫిజియోలు.. ఇలా ఎంతో మంది శ్రమించారు. తక్కువగా వచ్చిన సహాయ సిబ్బందిలో అందరికీ సమానంగా నా బోనస్‌ను చెందాలని ఆశిస్తున్నా’ అని రోహిత్ ఓ రిపోర్టర్‌తో అన్నాడట.
జట్టులోని 15 మంది ఆటగాళ్లకు రూ.5 కోట్లు, రిజర్వ్ ఆటగాళ్లకు రూ.కోటి చొప్పున అందించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కే రూ.5 కోట్లు.. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఒక్కొక్కరికి రూ.2.5 కోట్లు దక్కనున్నాయి. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో సహా సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.కోటి బోనస్‌ను ప్రకటించారు. ఇక సహాయక సిబ్బందిలో ముగ్గురు ఫిజియోథెరపిస్ట్‌లు, ముగ్గురు త్రోడౌన్ స్పెషలిస్టులు, ఇద్దరు మసాజర్‌లు, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌లకు ఒక్కొక్కరికి రూ.2 కోట్లను బీసీసీఐ ప్రకటించింది.