Rohit Sharma React on India Team for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 ముందు అఫ్గానిస్థాన్‌తో ఆఖరి పొట్టి సిరీస్‌ను భారత్ ఆడేసింది. ఇక జూన్‌లో వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరిగే పొట్టి కప్పులోనే నేరుగా భారత జట్టు బరిలోకి దిగనుంది. అయితే టీ20 ప్రపంచకప్ కోసం ఇంకా భారత జట్టు ఖరారు కాలేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. కానీ పొట్టి టోర్నీలో ఆడే 8-10 ఆటగాళ్లెవరో తమ మదిలో ఉన్నారని చెప్పాడు. ప్రధాన జట్టును ఎంపిక చేసినప్పుడు బాగా ఆడిన కొందరిని తప్పించక తప్పదు అని రోహిత్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ 14 నెలల విరామం అనంతరం అఫ్గాన్ సిరీస్‌తో టీ20ల్లో పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే.
‘వన్డే ప్రపంచకప్ 2023కు ముందు చాలా మంది కుర్రాళ్లకు నిరూపించుకునే అవకాశం ఇచ్చాం. టీ20 ప్రపంచకప్ 2024 కోసం కూడా ఆటగాళ్లను పరిశీలించి చూస్తున్నాం. కొందరు బాగా ఆడారు. కానీ ప్రధాన జట్టును ఎంపిక చేసినప్పుడు కొందరిని తప్పించక తప్పదు. అది వారికి నిరాశ కలిగిస్తుందని నాకు తెలుసు. జట్టులో ఓ స్పష్టత తేవడం మా కర్తవ్యం. 25-30 మంది ఆటగాళ్లలో మేం ప్రపంచకప్ జట్టును ఎంచుకోవాలి. ఇప్పటివరకు మేము భారత జట్టును ఖరారు చేయలేదు. కానీ టీ20 ప్రపంచకప్‌లో ఆడబోయే 8-10 మంది ఆటగాళ్లు మా మదిలో ఉన్నారు’ అని రోహిత్ శర్మ తెలిపాడు.
Also Read: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ సర్జరీ సక్సెస్.. బరిలోకి దిగేది ఎప్పుడంటే?
‘వెస్టిండీస్‌లో పిచ్‌లు మందకొడిగా ఉంటాయి. యూస్ పిచ్‌లు బిన్నంగా ఉంటాయి. అందుకు తగ్గట్లుగా భారత జట్టును ఎంపిక చేయాలి. నేను, కోచ్ రాహుల్ ద్రవిడ్ జట్టుకు ఒక రూపు తేవడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే అందరికీ అవకాశం రాకపోవచ్చు. అందరినీ సంతోషపెట్టలేమని కెప్టెన్సీలో నేర్చుకున్నా. ఎప్పుడూ కూడా జట్టు అవసరాలపైనే దృష్టి పెట్టాలి. ఏడాదికి పైగా నేను టీ20 క్రికెట్ ఆడకున్నా.. మ్యాచ్‌లు చూస్తూనే ఉన్నా. కొన్ని అంశాలపై నాకు అవగాహన ఉంది. రాహుల్ భాయ్‌తో కొన్ని ఆలోచనలు పంచుకున్నా. ఏదైనా భిన్నంగా చేయాలనుకున్నాం. బౌలర్లను భిన్న రకాలుగా ప్రయత్నించాలని భావించాం. పవర్‌ప్లేలో బౌలింగ్ చేయడం ఇబ్బందిగా భావించే బౌలర్‌ను అక్కడే (పవర్‌ప్లే) బౌలింగ్ చేయించాం. ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో ఇబ్బంది పడేవారిని ఆఖర్లో బౌలింగ్ చేయించాం’ అని రోహిత్ శర్మ చెప్పాడు.